చలి చంపేస్తుందా? మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి
చలికాలం రాగానే మన శరీరాన్ని చలి నుండి కాపాడుకోవడానికి ఎక్కడో దాచిపెట్టేసిన స్వెట్టర్లను, దుప్పట్లను బయటకు తీస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఐతే చలి చంపేస్తుంది. ఆ చలిని తట్టుకోలేక రాత్రిపూట జనాలు బయటకు రావడమే మానుకుంటారు. ఈ చలి వల్ల చర్మ పొడిబారడం, పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంటాయి. వాటికోసం ప్రత్యేకించి మాయిశ్చరైజర్లు వాడాల్సి ఉంటుంది. అదలా ఉంచితే ఈ చలికాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి. ఎండాకాలం ఎలాగైతే చల్లని ఆహారాలు తీసుకుని శరీరాన్ని చల్లగా ఉంచుకుంటామో చలికాలం శరీరాన్నివేడిగా ఉంచే ఆహారాలు తీసుకోవాలి. అలా వేడిచేసే మూలికల్లో మనకు అందుబాటులో, మన ఇంట్లోనే, మన కిచెన్లో దొరికే మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరాన్ని వేడిగా ఉంచే ఆయుర్వేద మూలికలు
తులసి: ఈ మొక్క దాదాపు ప్రతీ ఇంట్లో ఉంటుంది. తులసి టీ చేసుకుని సేవించినా, లేదా తులసి ఆకుల రసాన్ని వేడినీటిలో వేసుకుని తాగినా శరీరం వెచ్చగా ఉంటుంది. మెంతికూర: చలికాలం తీసుకోవాల్సిన అద్భుత ఆహారాల్లో ఇది కూడా ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, చెడుకొవ్వును తగ్గించి శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది. ఇంకా శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. కొత్తిమీర: రుతువు మారినప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా ఇది సాయపడుతుంది. సూప్ లలో, సలాడ్లలో తినవచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోజ్ మేరీ: చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఇవి రాకుండా రోజ్ మేరీ సాయపడుతుంది. అలాగే ఎలర్జీలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.