Cancer: మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు క్యాన్సర్ రిస్క్ తక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
శాకాహారం తీసుకునే వారికి ఐదు రకాల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. దాదాపు 18 లక్షల మందికిపైగా వ్యక్తుల ఆరోగ్య వివరాలను ఎన్నో సంవత్సరాల పాటు పరిశీలించి చేసిన ఈ విశ్లేషణలో, మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు అగ్న్యాశయ క్యాన్సర్ ముప్పు 21 శాతం, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు 12 శాతం,స్తన క్యాన్సర్ ముప్పు 9శాతం తగ్గినట్లు తేలింది. ఇవి మొత్తం కలిపి చూస్తే.. బ్రిటన్‌లో నమోదవుతున్న క్యాన్సర్ మరణాల్లో దాదాపు ఐదవ వంతు ఈ రకాలవేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు,కిడ్నీ క్యాన్సర్ ముప్పు 28శాతం,మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్ ముప్పు 31శాతం తక్కువగా ఉన్నట్లు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన తెలిపింది.
వివరాలు
బి విటమిన్లు వంటి ముఖ్య పోషకాలు తక్కువగా ఉండటం ఇందుకు కారణం
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ ఔరోరా పెరెజ్-కోర్నాగో మాట్లాడుతూ, "శాకాహారం పాటించే వారికి ఇది నిజంగా శుభవార్త. సమాజంలో ఎక్కువగా కనిపించే ఐదు క్యాన్సర్ల ముప్పు వీరిలో తక్కువగా ఉంది" అని చెప్పారు. అయితే మరోవైపు, శాకాహారుల్లో ఈసోఫెగస్‌లో కనిపించే స్క్వామస్ సెల్ కార్సినోమా అనే సాధారణ క్యాన్సర్ రకం ముప్పు మాంసాహారులతో పోలిస్తే దాదాపు రెట్టింపు ఉండొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. బి విటమిన్లు వంటి ముఖ్య పోషకాలు తక్కువగా ఉండటం ఇందుకు కారణం కావచ్చని సూచించారు. వీగన్లలో పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు 40 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. రోజుకు సగటున 590 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే తీసుకోవడం, ఇతర పోషకాలు కూడా తక్కువగా ఉండటం ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల డేటాను కలిపి పరిశోధన
ఈ తేడాలకు అసలు కారణం మాంసాహారమేనా, లేక శాకాహారంలో ఏదైనా ప్రత్యేక అంశం రక్షణ ఇస్తుందా అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టిమ్ కీ మాట్లాడుతూ, "ఈ తేడా మాంసాహారం వల్లే కావచ్చనే భావన ఉంది, కానీ దీనిపై నేరుగా పరిశీలించలేదు" అన్నారు. ఎర్ర మాంసం, ప్రాసెస్డ్ మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనే విషయం ముందే తెలిసినప్పటికీ, ఇప్పటివరకు శాకాహారులు, వీగన్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఇతర క్యాన్సర్లపై స్పష్టమైన విశ్లేషణ చేయడం కష్టమైంది. ఈ లోటును పూడ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల డేటాను కలిపి ఈ పరిశోధన చేశారు.
వివరాలు
మొత్తం 17రకాల క్యాన్సర్లపై అధ్యయనం దృష్టి
సుమారు 16 సంవత్సరాల పాటు 16.4 లక్షల మాంసాహారులు, 57 వేలమంది కోడి మాంసం మాత్రమే తినేవారు, 42వేలమంది చేపలు మాత్రమే తినేవారు,63వేలమంది శాకాహారులు,8,800కిపైగా వీగన్ల వివరాలను పరిశీలించారు. బాడీ మాస్ ఇండెక్స్, పొగ త్రాగడం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 17రకాల క్యాన్సర్లపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. అయితే శాకాహారులకు పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉందని చెప్పేందుకు సరైన ఆధారాలు లభించలేదని తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న మాంసాహారులు ఎర్ర మాంసం తక్కువగా తీసుకోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చేపలు తినే వారికి బ్రెస్ట్,కిడ్నీపెద్దప్రేగు క్యాన్సర్ల ముప్పు తక్కువగా ఉండగా,కోడి మాంసం మాత్రమే తినేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గినట్లు తేలింది.
వివరాలు
పరిశోధనకు వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ నిధులు
1990, 2000 దశకాల్లో నమోదు చేసిన ఆహారపు అలవాట్లు ఇప్పుడు మారిపోయి ఉండొచ్చని కూడా పరిశోధకులు గుర్తుచేశారు. ప్రస్తుతం అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువయ్యాయని, ఓట్ మిల్క్ వంటి వీగన్ ఉత్పత్తుల్లో కాల్షియం వంటి పోషకాలు కలుపుతున్నారని తెలిపారు. ఈ పరిశోధనకు వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ నిధులు సమకూర్చింది. అయితే, ఎన్‌హెచ్ఎస్ ఈట్‌వెల్ మార్గదర్శకాలను అనుసరించే మితమైన మాంసం, చేపల వినియోగంతో కూడిన ఆహారాన్ని పోల్చి చూడాల్సిన అవసరం ఉందని అబర్డీన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జూల్స్ గ్రిఫిన్ అభిప్రాయపడ్డారు. జనాభా స్థాయిలో ఆహారంతో సంబంధం ఉన్న క్యాన్సర్ల ముప్పును తగ్గించడానికి అదే సరైన మార్గం కావచ్చని ఆయన సూచించారు.