Vegetable Roti Pachadi: కూరగాయలతో నిమిషాల్లోనే పచ్చడి తయారీ..వెరీ సింపుల్
ఈ వార్తాకథనం ఏంటి
రోజూ ఒకే రకమైన కూరలు తింటూ బోర్ కొడుతోందా? ఇంట్లో ఉన్న కూరగాయలతోనే కారం కారం, కమ్మని పచ్చడి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చి కూరగాయల రోటి పచ్చడిని కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. పల్లెటూళ్లలో సంప్రదాయంగా చేసుకునే ఈ పచ్చడిని ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా వంట నైపుణ్యం అవసరం లేదు. కూరగాయలను వేయించి, రోటిలో దంచి, చివరగా పోపు పెడితే సరిపోతుంది. మీకు అందుబాటులో ఉన్న కూరగాయలతోనూ రుచికి తగ్గట్టుగా చేసుకోవచ్చు
Details
కావాల్సిన పదార్థాలు
ఈ పచ్చడి తయారీకి ఒక కప్పు బీరకాయ ముక్కలు, 4 చిన్న వంకాయలు, 4 టమాటాలు, ఒక కప్పు దొండకాయ ముక్కలు, ఒక కప్పు బెండకాయ ముక్కలు, 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకోవాలి.
వీటితో పాటు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె సిద్ధం చేసుకోవాలి.
పోపు కోసం ఆవాలు, మినపప్పు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా నూనె అవసరం.
Details
తయారీ విధానం
ముందుగా పాన్లో నూనె వేడి చేసి బీరకాయ, వంకాయ, దొండకాయ, బెండకాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి.
మీడియం మంటపై సుమారు 10 నిమిషాలు వేయించాలి. కూరగాయలు మెత్తబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. అవసరమైతే మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి రోటిలో వేయాలి.
ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా దంచుకోవాలి. ఇలా చేస్తే కూరగాయల రుచి బాగా తెలుస్తుంది.
చివరగా చిన్న పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును పచ్చడిలో కలిపితే ఘుమఘుమలాడే కూరగాయల రోటి పచ్చడి సిద్ధం.