
Janmashtami 2025: జన్మాష్టమి రోజున 56 రకాల పదార్ధాలను నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని గల్లీ గల్లీ లో కూడా జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదినం రోజున అన్ని దేవాలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ పూజలో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏంటంటే, 56 రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించడం. అవును, జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని స్మరించుకుని 56 రకాల రుచికరమైన వంటకాలను ఆహారంగా ప్రసాదం చేస్తారు. ఈ పెద్ద సంఖ్యలో వంటకాలను సమర్పించే సంప్రదాయం వెనుక ఉన్న ఆ పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం.
వివరాలు
ఇంద్రుడు కరుణ కోసం పూజలు
పురాణాల ప్రకారం, ఒకప్పుడు బ్రజ్ ప్రజలు ఇంద్రుడిని సంతృప్తి పరచడానికి ఒక పెద్ద పూజను నిర్వహించబోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారో బాల గోపాల కృష్ణుడు తన తండ్రి నందుడిని అడిగాడు. నందుడు చెప్పిన ప్రకారం, ఇంద్రుడు వర్షాలకు పాలకుడు కావడం వలన అతని కరుణ కోసం పూజలు చేస్తే మంచివర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని నమ్మకం ఉంది. కానీ,కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించాలని ప్రజలకు చెప్పాడు. ఎందుకంటే గోవర్ధన పర్వతం మనకు పండ్లు, కూరగాయలు ఇస్తూ జంతువులకు మేతను అందించే ప్రకృతి దాత అని ఆయన భావించాడు. కృష్ణుడి ఆ ఆలోచనతో గోకుల ప్రజలు గోవర్ధన పర్వతాన్ని ఆరాధించారు.
వివరాలు
కృష్ణుడు ఏడు రోజులపాటు ఆ పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు
ఈ పరిస్థితిని చూసి ఇంద్రుడికి చాలా కోపం వచ్చి,ఆయన గోకులంలో భారీగా వర్షం కురిపించాడు. గ్రామంలో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది.అప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి,వర్షం నుంచి గోకుల వాసులను రక్షించేందుకు గొడుగుగా పట్టాడు ఆ పర్వతం కింద గ్రామస్తులు, జంతువులు, పక్షులు సురక్షితంగా ఉండగలిగారు. కృష్ణుడు ఏడు రోజులపాటు ఆ పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు. ఏడు రోజులు గడిచాక ఇంద్రుడి కోపం తగ్గి వర్షం ఆగిపోయింది. ఆ ఏడు రోజులు కృష్ణుడు తినలేదని గోకుల వాసులు భావించారు. అప్పుడే కృష్ణుడి తల్లి యశోద, తన కుమారుడికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం ఇస్తుందని గుర్తుచేసుకుని, ఆయనకు తినిపించడానికి పలు వంటకాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
వివరాలు
56 రకాల వంటకాలు
అందరూ కలిసి 56 రకాల వంటకాలను తయారుచేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించారు. అప్పటినుండి జన్మాష్టమి నాడు 56 రకాల భోగాలను కృష్ణునికి సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఈ 56 రకాల ఆహార పదార్థాల్లో ఏమేమి ఉంటాయంటే, చప్పన్ భోగ్ లో తీయటి స్వీట్లు, పండ్లు, తృణధాన్యాలు, పానీయాలు, పాలతో చేసిన వివిధ వంటకాలు ఉంటాయి. సంప్రదాయ జాబితాలో వెన్నతో చేసిన మిఠాయిలు, చక్కెర మిఠాయిలు, కోవా, లడ్డు, రబ్రీ, పూరీ, కచోరి, హల్వా, కిచిడి, పండ్ల విభిన్న రకాలు, పానీయాలు తదితర అనేక రకాల వస్తువులు ఉంటాయి.