వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హిప్పో.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్షీరదం. అంటే పాలిచ్చే జంతువుల్లో మూడవ అతిపెద్ద జంతువు. మొదటి స్థానంలో ఏనుగు, రెండవ స్థానంలో ఖడ్గమృగం ఉంది.
ఫిబ్రవరి 15వ తేదీన ప్రపంచ హిప్పోల దినోత్సవాన్ని జరుపుతున్నారు. హిప్పోల రక్షణ కోసం మానవాళి చేయాల్సిన పనులను ఈరోజు గుర్తు చేస్తుంటారు. హిప్పోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
హిప్పోలు 5మీటర్ల వరకు పెరగగలవు, 3500కిలోల బరువు ఉంటాయి. గంటకు 30కిలో మీటర్ల వేగంతో హిప్పోలు పరుగెత్తగలవు.
ఇవి గుంపుగా నివసిస్తాయి. దాదాపుగా 30హిప్పోలు కలిసి ఒక ప్రాంతాన్ని చూసుకుంటాయి. ఆ ప్రాంతం దాటి అవి బయటకు వెళ్ళవు. ఆ ప్రాంత బౌండరీలను గుర్తుపెట్టుకోవడానికి అవి మలవిసర్జన, మూత్ర విసర్జన చేస్తాయి.
వరల్డ్ హిప్పో డే
ఎరుపు రంగులో చెమటను విడుదల చేసే హిప్పోలు
హిప్పోలు విసర్జించిన ప్రదేశం, ఎర్రగా మారిపోతుంది. దాంతో హిప్పోలు తమ ప్రదేశాలను గుర్తుంచుకుంటాయి.
హిప్పోలకు చెమట రాదు, కానీ ఎర్రని ద్రవం వాటి శరీరం మీద కనిపిస్తుంటుంది. దానివల్ల చర్మం తేమగా ఉండడమే కాదు, సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ దొరుకుతుంది.
హిప్పోలు బాగా ఈదగలవు. కానీ అవి నీటిమీద తేలలేవు. వాటి బరువు కారణంగా నీళ్ళలో మునిగిపోతాయి తప్ప నీటిమీద తేలియాడలేవు.
హిప్పోలకు పక్షులకు మంచి సంబంధం ఉంటుంది. హిప్పోల చర్మం మీద ఉండే పురుగులను పక్షులు తినేస్తాయి. హిప్పోలకు కార్ప్ చేపలకు కూడా ఇలాంటి బంధమే ఉంటుంది. హిప్పోల నోట్లో ఉండే ఆల్గేని కార్ప్ చేప తినేస్తుంది. దాంతో హిప్పో నోరు శుభ్రమవుతుంది.