జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
జనవరి 23.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాంతంత్ర్యాన్ని ఇస్తాను అని ఎలుగెత్తి చాటిన యోధుడు పుట్టిన పవిత్ర దినం. 1897సంవత్సరంలో జనవరి 23వ తేదీన ఒడిషాలో కటక్ లోజన్మించిన నేతాజీ, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టాలని ఆజద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని స్థాపించారు. 1921 నుండి 1941వరకు దాదాపు 11సార్లు జైలు పాలయ్యాడు. దేశభక్తులందరిలో రాజులాంటి వాడు సుభాష్ చంద్రబోస్ అని మహాత్మగాంధీ పిలిచేవారు. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో పాసై, దేశం కోసం పనిచేయడానికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు. ఆ మహనీయుడిని స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం స్మృతి చిహ్నాన్ని నిర్మించింది.
అండమాన్ దీవుల్లో నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభించున్న ప్రధాని
సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్మరించుకోవడానికి, 2021 నుండి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ పరాక్రమ దినోత్సవంగా జరుపుతోంది. ఈరోజు ఆయన 126వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ, సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. అలాగే నేతాజీ స్మృతి చిహ్నాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి చేసారు. అండమాన్ నికోబార్ దీవులోని రోజ్ ఐలాండ్ లో ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మూజియం, కేబుల్ కార్ రోప్ వే, చిల్డ్రన్స్ పార్క్ ఉండనున్నాయని అధికారుల సమాచారం. ఈ స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రోజ్ ఐలాండ్ ద్వీపం పేరును 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా పేరు మార్చారు.