Sanju Samson: 'నా వల్ల కాదు.. అతడి వల్లే గెలిచాం' : ఆ ప్లేయర్ కే క్రెడిట్ ఇచ్చిన సంజు శాంసన్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా జట్టు, ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. అయితే ఈ అవార్డు తాను అర్హుడు కాదని, నిజానికి అది జస్పిత్ బుమ్రాకే చెందాల్సిందని సంజూ వినయంగా వ్యాఖ్యానించాడు
Details
భారీ స్కోరు.. సంజూ మెరుపులు
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే శివం దూబే (25 బంతుల్లో 43), ఇషాన్ కిషణ్ (18 బంతుల్లో 39), హర్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) వేగంగా ఆడి జట్టుకు బలమైన స్కోరు అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ సాధించాడు.
Details
బెథెల్ సెంచరీ వృథా
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెతల్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసకరంగా 105 పరుగులు చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులకే పరిమితమైంది. భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, ఆర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా ఒక్క వికెట్ తీశారు.
Details
కీలక మ్యాచ్‌ల్లో ఫామ్ అందుకోవడం సులువు కాదు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత సంజూ మాట్లాడుతూ.. గెలవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. గత మ్యాచ్‌లోనే తాను ఫామ్ అందుకున్నానని, అదే జోష్‌ను ఈ మ్యాచ్‌లో కొనసాగించాలని భావించానని తెలిపాడు. దేశం కోసం ఆడేటప్పుడు కీలక మ్యాచ్‌ల్లో ఫామ్‌లోకి రావడం అంత సులువు కాదని చెప్పాడు. నేను బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. అందుకే తొలుత క్రీజులో సెట్ అయ్యేందుకు కొంత సమయం తీసుకున్నాను. తరువాత అన్నీ అనుకున్నట్లే జరిగాయి. కొద్దిగా అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ నా క్యాచ్ వదిలేయడం మాకు ఉపయోగపడిందని సంజూ వివరించాడు.
Details
వాంఖడేలో భారీ స్కోరు కూడా సురక్షితం కాదు
వాంఖడేలో ఆడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుందని సంజూ అన్నాడు. ఇక్కడ ఎంత భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవడం సులువు కాదు. అందుకే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని అనుకున్నాం. 250 పరుగుల లక్ష్యాన్ని కూడా ఇక్కడ ఛేజ్ చేయొచ్చు. ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. వారి బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇది గొప్ప సెమీస్ మ్యాచ్ అని పేర్కొన్నాడు.
Details
భాగస్వామ్యం మాకు నమ్మకం ఇచ్చింది
వాంఖడే మైదానంలో మేము ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. ఇక్కడి పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ఛేజింగ్ చేయడం సులువు. ప్రత్యర్థి టాస్ గెలవడంతో మేము ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అభిషేక్ త్వరగా ఔట్ అయ్యాడు. అయితే ఇషాన్ కిషన్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం చూసిన తర్వాత 250 పరుగులు చేయొచ్చనే నమ్మకం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. జట్టుగా రాణించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సంజూ తెలిపాడు.
Details
బుమ్రానే అసలు హీరో
భారత్ విజయంలో అసలు పాత్ర జస్ప్రిత్ బుమ్రాదేనని సంజూ స్పష్టం చేశాడు. బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతను తరం లోకే ఒక్కడు. డెత్ ఓవర్లలో అతను అద్భుతంగా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలబడే వాడిని కాదు. నిజానికి ఈ అవార్డు అతడికే దక్కాలి. గెలుపు క్రెడిట్ బౌలర్లదే. కఠిన పరిస్థితుల్లో వారు అద్భుతంగా బౌలింగ్ చేశారని పేర్కొన్నాడు.
Details
సెంచరీ కన్నా జట్టు విజయం ముఖ్యం
వాంఖడేలో ప్రేక్షకుల ప్రోత్సాహం మరువలేనిదని సంజూ అన్నాడు. భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లకూ అభిమానులు మద్దతు ఇచ్చారని చెప్పాడు. నేను మైలురాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించను. టీ20ల్లో సెంచరీ చేయడం అంత ముఖ్యమేమీ కాదు. బంతిని బలంగా బాదుతూ ఆడాలి. ఆ ప్రక్రియలో సెంచరీ వస్తే ఆనందమే. కానీ నా దృష్టిలో మ్యాచ్ గెలవడంలో నేను ఎంత సహకరించానన్నదే చాలా ముఖ్యమైందని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.