Loading...
Precision Oncology Centre: అమరావతిలో దేశంలోనే తొలి ప్రెసిషన్‌ ఆంకాలజీ కేంద్రం.. క్యాన్సర్‌కు ఏఐతో చికిత్స
క్యాన్సర్‌కు ఏఐతో చికిత్స

Precision Oncology Centre: అమరావతిలో దేశంలోనే తొలి ప్రెసిషన్‌ ఆంకాలజీ కేంద్రం.. క్యాన్సర్‌కు ఏఐతో చికిత్స

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యాన్సర్‌ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ఆధారంగా అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ ప్రెసిషన్‌ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఫార్మాస్యూటికల్‌-బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ జీనోమిక్స్‌ సొల్యూషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వైద్యారోగ్య శాఖ, ఆస్ట్రాజెనెకా ఇండియా ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

వివరాలు 

క్యాన్సర్‌ ప్రారంభ దశలోనే సరైన చికిత్స అందిస్తే రోగులకు ఎంతో ప్రయోజనం

ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ రంగాల్లో మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాలుష్యం వంటి అనేక కారణాలతో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

వైద్యారోగ్య రంగంలో వేగవంతమైన మార్పులు రావాలని, క్యాన్సర్‌తో పాటు ఇతర వ్యాధులపై కూడా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ వేదికగా విస్తృత పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జీఎస్‌ సాయిప్రసాద్‌, ఆస్ట్రాజెనెకా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌రావు, స్ట్రాండ్‌ లైఫ్‌సైన్సెస్‌, క్యూఆర్‌ఏఐ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వివరాలు 

దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ ప్రెసిషన్‌ ఆంకాలజీ విధానం

రిలయన్స్‌కు చెందిన స్ట్రాండ్‌ లైఫ్‌సైన్సెస్, క్యూఆర్‌ఏఐ సంస్థల భాగస్వామ్యంతో ఆస్ట్రాజెనెకా ఇండియా అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ జీనోమిక్‌ సొల్యూషన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

దీని ద్వారా దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ ప్రెసిషన్‌ ఆంకాలజీ చికిత్స విధానం అమరావతిలో అందుబాటులోకి రానుంది.

ఈ కేంద్రంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ రోగుల కోసం అత్యాధునిక జన్యుపరీక్షలు, బయోమార్కర్‌ టెస్టింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ-ఆస్ట్రాజెనెకా ఇండియా భాగస్వామ్యంతో ఈ ప్రెసిషన్‌ ఆంకాలజీ విధానాన్ని అమలు చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ, జన్యు సాంకేతికతతో ముందస్తు గుర్తింపు

కృత్రిమ మేధ (ఏఐ), నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌, ఆధునిక జన్యు విశ్లేషణ సాంకేతికతలను వినియోగించి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, ప్రతి రోగి శరీర తత్వానికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్స అందించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు.

అదే సమయంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఎక్స్‌రే వ్యవస్థను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.

దీని ద్వారా రోగులకు వేగవంతమైన స్క్రీనింగ్‌, ఖచ్చితమైన నిర్ధారణ సేవలు అందడంతో పాటు ఆలస్యం లేకుండా చికిత్స ప్రారంభించే అవకాశం కలగనుంది.

ADVERTISEMENT