Trump : ఒకే రోజు.. ఇద్దరు ప్రపంచ నేతలు.. రెండు యుద్ధాలపై ట్రంప్ కీలక దౌత్య చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే రోజు ఇద్దరు కీలక ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ సంక్షోభాలు, భద్రతా పరిస్థితులు, శాంతి ప్రయత్నాలపై ఈ భేటీల్లో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ రెండు సమావేశాలు కూడా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో పూర్తిగా గోప్యంగా జరిగాయి. మీడియా ప్రతినిధులను సమావేశాలకు అనుమతించలేదు. అయితే ఈ భేటీలు సానుకూల వాతావరణంలో జరిగాయని,ఫలప్రదంగా ముగిశాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.
వివరాలు
"పికాక్స్ మౌంటెన్" భూగర్భ కేంద్రంపై ఇజ్రాయెల్ సేకరించిన నిఘా సమాచారం
ఉదయం 9:40 గంటలకు జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌కు చేరుకోగా, మధ్యాహ్నం 12:25 గంటల తర్వాత నెతన్యాహు అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, లెబనాన్‌కు సంబంధించిన పరిస్థితులు, అబ్రహం ఒప్పందాల విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అలాగే టెహ్రాన్ అణు కార్యక్రమాలకు సంబంధం ఉందని భావిస్తున్న "పికాక్స్ మౌంటెన్" భూగర్భ కేంద్రంపై ఇజ్రాయెల్ సేకరించిన నిఘా సమాచారాన్ని నెతన్యాహు ట్రంప్‌కు అందించినట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ
అయితే ఆ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఈ విషయాన్ని నాతో చెప్పి ఉంటే సరిపోయేది. ప్రపంచానికి ఎందుకు ప్రకటించాలి?" అంటూ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఇరాన్ అంశంలో తమ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ఎక్కువ విషయాల్లో ఏకాభిప్రాయం ఉందని ట్రంప్ తెలిపారు.
ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసే అవకాశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
రెండు సమావేశాలు ఫలప్రదంగా జరిగాయన్న వైట్‌హౌస్
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, శాంతి చర్చల పునరుద్ధరణ, ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి కొనసాగనున్న మద్దతు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ముఖ్యంగా వాయు రక్షణ వ్యవస్థలు, దౌత్యపరమైన ప్రయత్నాలపై ట్రంప్‌తో విస్తృతంగా చర్చించినట్లు సమావేశం అనంతరం జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యాపై మరిన్ని ఆంక్షలు, డ్రోన్ ఒప్పందం, పాట్రియాట్ క్షిపణి వ్యవస్థల సరఫరాలో పురోగతి సాధించాలనే లక్ష్యంతోనే తాను వాషింగ్టన్‌కు వచ్చినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశాభావంతో ఉన్నట్లు వైట్‌హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.