LOADING...
Mega Steel Plant: 23న ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ.. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు
రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు

Mega Steel Plant: 23న ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ.. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపేలా ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆర్సెలార్‌ మిత్తల్‌ అండ్‌ నిప్పన్‌ స్టీల్‌ సంస్థల ఆధ్వర్యంలో సుమారు రూ.1.50 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించనున్న భారీ స్టీల్‌ ప్లాంటుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

వివరాలు 

30 వేల మందికి ఉపాధి అవకాశాలు

ఇది రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తొలి దశలో రూ.80 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2029 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి, సంవత్సరానికి 8.2 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలోనే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి వెల్లడించారు.

Advertisement