Loading...
CWG 2026 - India: కామన్వెల్త్ గేమ్స్‌కు నేడు ముగింపు.. భారత్‌కు ఏకంగా 7 పతకాలపై ఆశలు!
కామన్వెల్త్ గేమ్స్‌కు నేడు ముగింపు.. భారత్‌కు ఏకంగా 7 పతకాలపై ఆశలు!

CWG 2026 - India: కామన్వెల్త్ గేమ్స్‌కు నేడు ముగింపు.. భారత్‌కు ఏకంగా 7 పతకాలపై ఆశలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పది రోజులుగా క్రీడాభిమానులను అలరించిన కామన్వెల్త్ గేమ్స్‌ 2026 (Commonwealth Games 2026)కు ముగింపు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఈ మెగా టోర్నీ చివరి రోజు కాగా, భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి వరకు పోటీలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం భారత్‌ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. చివరి రోజు భారత్‌కు ప్రధాన ఆశలు జూడో, ట్రాక్‌ సైక్లింగ్‌, పారా ట్రాక్‌ సైక్లింగ్‌పైనే ఉన్నాయి. ఈ ఈవెంట్లలో కలిపి దాదాపు ఏడు పతకాలు సాధించే అవకాశముంది.

వివరాలు

జూడోలో భారత ఆశలు

మహిళల 78 కేజీల విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16లో భారత జూడోకా ఇశ్రూప్‌ నారంగ్‌ స్కాట్లాండ్‌కు చెందిన నికోలె వుడ్‌తో మధ్యాహ్నం 2.30 గంటలకు తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మెడల్‌ రౌండ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆ పోటీలు రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

పురుషుల -100 కేజీల విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16లో అవతార్‌ సింగ్‌ సైప్రస్‌కు చెందిన అరిస్టోస్‌ మైకెల్‌తో పోటీ పడనున్నాడు.

ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మెడల్‌ రౌండ్స్‌కు చేరుకుంటాడు.

అలాగే పురుషుల 100+ కేజీల విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16లో యశ్‌ ఘంగాస్‌ వేల్స్‌కు చెందిన జాషువా వైట్‌హౌస్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మెడల్‌ రౌండ్స్‌కు అర్హత పొందుతాడు.

వివరాలు

ట్రాక్‌ సైక్లింగ్‌లో కీలక పోటీలు

పురుషుల 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ ఫైనల్‌లో రొనాల్డో సింగ్‌ లైటోంజమ్‌ మధ్యాహ్నం 3.51 గంటలకు బరిలోకి దిగనున్నాడు. మహిళల సీ4-సీ5 1000మీటర్ల టైమ్‌ ట్రయల్‌ ఫైనల్‌లో భారత పారా సైక్లిస్ట్‌ లిషా దాస్‌ రాత్రి 8.40 గంటలకు పోటీ పడనుంది.

పురుషుల 40 కిలోమీటర్ల పాయింట్స్‌ రేస్‌ క్వాలిఫికేషన్‌లో హర్వీష్‌ సింగ్‌ సెఖోన్‌ (హీట్‌-1), దినేశ్‌ కుమార్‌ (హీట్‌-2) మధ్యాహ్నం 2.09 గంటలకు తమ తమ హీట్లలో పోటీ పడనున్నారు.

క్వాలిఫికేషన్‌లో విజయవంతమైతే రాత్రి 9.09 గంటలకు జరిగే ఫైనల్‌లో పతకం కోసం పోరాడనున్నారు.

చివరి రోజు భారత్‌కు జూడో, ట్రాక్‌ సైక్లింగ్‌, పారా ట్రాక్‌ సైక్లింగ్‌ విభాగాల్లో పతకాల అవకాశాలు ఉండటంతో అభిమానుల దృష్టి మొత్తం ఈ ఈవెంట్లపైనే నిలిచింది.

ADVERTISEMENT