LOADING...
Pawan Kalyan: స్థానిక ఎన్నికల ముందు కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan: స్థానిక ఎన్నికల ముందు కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గురువారం శాసనసభలో పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, అటవీ,పర్యావరణ శాఖల డిమాండ్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ కింద తాజాగా ఏడు బహుళ ప్రయోజన తాగునీటి పథకాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మరో ఐదు పథకాల పనులను ప్రారంభించామని వెల్లడించారు. గత ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిన మూడు పథకాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా తీవ్రమైన తాగునీటి కొరత ఉన్న సుమారు మూడు వేల గ్రామాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వివరాలు 

వాలంటీర్ల అక్రమాలపై ఎమ్మెల్యేల విమర్శలు

ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులను పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు సమయానికి విడుదల చేస్తున్నామని తెలిపారు. పంచాయతీల పునర్విభజనకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. శాసనసభ చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను దెబ్బతీసిందని ఆరోపించారు. ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించి గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జేబుదొంగలు, గంజాయి వ్యాపారం చేసే వారిని కూడా వాలంటీర్లుగా నియమించారని ఆరోపించారు. వాలంటీర్ల అన్యాయాల వల్ల అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.

వివరాలు 

వాలంటీర్ల అక్రమాలపై ఎమ్మెల్యేల విమర్శలు

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి కూడా అలాంటి పరిస్థితుల్లోనే ప్రాణాలు తీసుకున్నాడని సభలో చెప్పారు. గిరిజన గ్రామాలకు రహదారులు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ 'అడవిబాట' కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అలాగే గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా జలజీవన్ మిషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం ద్వారా రికార్డు సృష్టించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆయన అభినందించారు.

Advertisement

వివరాలు 

భారీ వృక్షాలను మరోచోట నాటేలా కొత్త విధానం

రోడ్ల విస్తరణ సమయంలో తొలగించాల్సి వచ్చే వందేళ్లకు పైబడిన భారీ వృక్షాలను మరో ప్రదేశంలో తిరిగి నాటే విధంగా ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విషయంలో నెలరోజుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటిస్తామని చెప్పారు. పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా భారీ వృక్షాలను నరికివేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, వాటిని సంరక్షించడం ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో తొలగించిన పెద్ద వృక్షాలను మరోచోట విజయవంతంగా మళ్లీ నాటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు,స్థానిక ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు.

Advertisement

వివరాలు 

భారీ వృక్షాలను మరోచోట నాటేలా కొత్త విధానం

అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల నాటడం, నర్సరీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. నాటిన ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేస్తున్నామని చెప్పారు. బెంగళూరులో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను కూడా అనుసరిస్తున్నామని వెల్లడించారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నర్సరీలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎర్రచందనం చెక్కకు సరైన ధర లభించేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు.

Advertisement