LOADING...
Telangana: నేటి నుంచి 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'.. 99 రోజుల కార్యాచరణ అమలు
నేటి నుంచి 'ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక'.. 99రోజుల కార్యాచరణ అమలు

Telangana: నేటి నుంచి 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'.. 99 రోజుల కార్యాచరణ అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో శుక్రవారం నుంచి జూన్‌ 12 వరకు 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మూడోసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పది వారాలపాటు ప్రతి వారం ఒక ప్రత్యేక శాఖకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వారోత్సవాలు జరపనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

ఇందిరా మహిళాశక్తి భవనాల ప్రారంభం

'ఇందిరా మహిళాశక్తి' కార్యక్రమం కింద మహిళల వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలను గుర్తించడం పాటు, ప్రతి జిల్లాలో ఇందిరా మహిళాశక్తి భవనాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 99 రోజుల ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వరకు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయనున్నారు. మండలాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను కూడా భాగస్వాములుగా చేశారు.

వివరాలు 

ఇప్పటికే రెండు సార్లు నిర్వహణ

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు. పౌరసేవలతో సంబంధం ఉన్న అన్ని శాఖలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాయి. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను కూడా ఈ సమయంలో పరిష్కరించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6 వరకు మొదటిసారిగా ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. తరువాత 2025 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు రెండోసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రెండు సందర్భాల్లో గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం నేరుగా ప్రజల దగ్గరకు చేరింది.

Advertisement

వివరాలు 

ఈసారి చేపట్టే చర్యలు

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకుంది. ఈ రెండు విడతల్లో ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు,అభ్యర్థనల ఆధారంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మూడోసారి నిర్వహించనుంది. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు,వాటి ఫలితాలపై గ్రామాలు,వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా గ్రామ, వార్డు సభల ద్వారా అవగాహన కల్పించనున్నారు. విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, వైద్యరంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు,ఆసుపత్రులను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రజలకు వివరించనున్నారు. అలాగే సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడం,దాని ద్వారా ప్రజలకు ఆదాయ అవకాశాలు ఎలా లభిస్తాయో కూడా తెలియజేయనున్నారు.

Advertisement

వివరాలు 

నిరంతర ప్రక్రియగా రేషన్‌కార్డుల పంపిణీ

ఇళ్ల స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఆర్థిక సహాయం అందించి ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీని నిరంతర ప్రక్రియగా కొనసాగించనుంది. అదేవిధంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను కూడా ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అమలు చేయనుంది.

వివరాలు 

ఏ వారం ఏ అంశం..

తొలివారం: మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 4 - గ్రామీణాభివృద్ధి రెండోవారం: ఏప్రిల్‌ 6-11 - ఆరోగ్యరంగం మూడోవారం: ఏప్రిల్‌ 13-18 - అరైవ్‌ అలైవ్‌ నాలుగో వారం: ఏప్రిల్‌ 20-25 - సంక్షేమం ఐదో వారం: ఏప్రిల్‌ 27 నుంచి మే 2 - పిల్లల భద్రత, డ్రగ్స్‌ అడ్డుకట్ట ఆరో వారం: మే 4-9 - రైతు సంక్షేమం ఏడో వారం: మే 11-16 - విద్య ఎనిమిదో వారం: మే 18-23 - యువత, క్రీడలు తొమ్మిదో వారం: - మే 25-30 - మహిళా సంక్షేమం పదోవారం: జూన్‌ 1-6 - పర్యావరణం

Advertisement