Loading...
Dandzbergs: 16 ఏళ్లకే డిఫెన్స్ స్టార్టప్.. ఏఐ క్షిపణుల తయారీకి యువకుడి శ్రీకారం
16 ఏళ్లకే డిఫెన్స్ స్టార్టప్.. ఏఐ క్షిపణుల తయారీకి యువకుడి శ్రీకారం

Dandzbergs: 16 ఏళ్లకే డిఫెన్స్ స్టార్టప్.. ఏఐ క్షిపణుల తయారీకి యువకుడి శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

లాట్వియాలో జన్మించిన 16 ఏళ్ల యువకుడు హెన్రిజ్ దాండ్జ్‌బెర్గ్స్ రక్షణ రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. చిన్న వయసులోనే డిఫెన్స్ టెక్నాలజీ స్టార్టప్‌ను ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అత్యాధునిక క్షిపణులను తయారు చేయాలనే లక్ష్యంతో 'పోలెమోస్ ఇండస్ట్రీస్' (Polemos Industries) అనే సంస్థను స్థాపించాడు. వై కాంబినేటర్ నుంచి రూ.4 కోట్లకు పైగా నిధులు హెన్రిజ్ తన స్టార్టప్ కోసం అమెరికాకు చెందిన ప్రముఖ స్టార్టప్ యాక్సిలరేటర్ 'వై కాంబినేటర్' (Y Combinator)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. ఈ సంస్థ నుంచి పోలెమోస్ ఇండస్ట్రీస్‌కు 5 లక్షల డాలర్ల ప్రారంభ పెట్టుబడి లభించింది.

వివరాలు 

జామింగ్ వ్యవస్థలను తట్టుకునే క్షిపణుల తయారీ

భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.4 కోట్లకు పైమాటే. వై కాంబినేటర్‌కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కులైన వ్యవస్థాపకుల్లో హెన్రిజ్ ఒకరిగా నిలిచాడు.

ప్రస్తుతం పోలెమోస్ ఇండస్ట్రీస్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల కొత్త తరహా గైడెడ్ క్షిపణుల అభివృద్ధిపై పనిచేస్తోంది.

శత్రువులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలను సైతం తట్టుకునేలా వీటిని రూపొందిస్తోంది.

అంతేకాకుండా, వివిధ ప్రాంతాల నుంచి సులభంగా ప్రయోగించే విధంగా డిజైన్ చేస్తోంది.

ఈ క్షిపణులకు సంబంధించిన గైడెన్స్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది.

ప్రస్తుతం హార్డ్‌వేర్ తయారీపై దృష్టి సారించింది. 2026 డిసెంబర్ నాటికి తొలి ప్రోటోటైప్‌ను ప్రదర్శించాలని హెన్రిజ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

వివరాలు 

ఉక్రెయిన్ యుద్ధమే ప్రేరణ

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత తూర్పు ఐరోపా దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలు, ఉద్రిక్తతలు పెరిగాయి.

ఈ పరిణామాలను గమనించిన హెన్రిజ్ రక్షణ రంగ సాంకేతికతపై ఆసక్తి పెంచుకున్నాడు.

ఈ రంగంలో తన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు హైస్కూల్ చదువును సైతం మధ్యలోనే నిలిపివేశాడు.

అయితే సైనిక ఆయుధాల తయారీలో కృత్రిమ మేధను ఉపయోగించడంపై నిపుణులు కొన్ని నైతికపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఏఐ ఆధారిత ఆయుధాలు నిర్ణయాలు తీసుకునే సమయంలో పొరపాట్లు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయినప్పటికీ భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం మారనుందని, ఆధునిక రక్షణ వ్యవస్థల్లో ఏఐ ఆధారిత క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయని హెన్రిజ్ అభిప్రాయపడుతున్నాడు.

ADVERTISEMENT