Loading...
GSAT-7C: వాయుసేనకు జీశాట్‌-7సీ ఉపగ్రహం.. రూ.2,563 కోట్లతో ఒప్పందం
వాయుసేనకు జీశాట్‌-7సీ ఉపగ్రహం.. రూ.2,563 కోట్లతో ఒప్పందం

GSAT-7C: వాయుసేనకు జీశాట్‌-7సీ ఉపగ్రహం.. రూ.2,563 కోట్లతో ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాయుసేన,నౌకాదళాల రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.4,106 కోట్ల విలువైన రెండు రక్షణ ఒప్పందాలపై రక్షణ శాఖ గురువారం సంతకాలు చేసింది. భారత వాయుసేన కోసం జీశాట్‌-7సీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని సమకూర్చుకోవడంతోపాటు, నౌకాదళం కోసం అధునాతన హెవీ వెయిట్‌ టార్పిడోలను కొనుగోలు చేయనుంది. వాయుసేన సమాచార వ్యవస్థను మరింత సురక్షితంగా, పటిష్ఠంగా మార్చేందుకు జీశాట్‌-7సీ ఉపగ్రహాన్ని ఉపయోగించనున్నారు. ఈ ఉపగ్రహం కోసం బెంగళూరుకు చెందిన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో రూ.2,563 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన జీశాట్‌-7సీ ఉపగ్రహం అందుబాటులోకి రావడంతో వాయుసేన సమాచార వ్యవస్థ సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని రక్షణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

సముద్రజలాల్లో శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యం

మరోవైపు,నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్‌ టార్పిడోలను సమకూర్చుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌)తో రూ.1,543కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ దేశీయంగా ఈ టార్పిడోలను అభివృద్ధి చేసింది.

యుద్ధనౌకల నుంచి సముద్ర గర్భంలో ఉన్న శత్రు జలాంతర్గాములపైకి ప్రయోగించేలా వీటిని రూపొందించారు.

వరుణాస్త్ర టార్పిడోలు అధునాతన దిశ మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

నీటిలో ఎక్కువ దూరం ప్రయాణించే జలాంతర్గాములను సైతం గుర్తించి ఛేదించగలవు.

వీటిని నౌకాదళంలో చేర్చడం ద్వారా సముద్రజలాల్లో శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ శాఖ తెలిపింది.

ఈ రెండు ఒప్పందాలతో భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం పెరగడంతోపాటు వాయుసేన,నౌకాదళాల కార్యాచరణ సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి.

ADVERTISEMENT