Loading...
Medieval Remedy : పురాతన ఔషధంతో బ్యాక్టీరియాకు చెక్‌.. తాజా పరిశోధనలో కీలక విషయాలు
పురాతన ఔషధంతో బ్యాక్టీరియాకు చెక్‌.. తాజా పరిశోధనలో కీలక విషయాలు

Medieval Remedy : పురాతన ఔషధంతో బ్యాక్టీరియాకు చెక్‌.. తాజా పరిశోధనలో కీలక విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెయ్యేళ్ల క్రితం ఉపయోగించిన ఓ సంప్రదాయ ఔషధం.. నేటి ప్రపంచాన్ని తీవ్రంగా వేధిస్తున్న యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ సమస్యకు కొత్త మార్గాన్ని చూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. 10వ శతాబ్దానికి చెందిన ఓ వైద్య గ్రంథంలో ఉన్న ఔషధ మిశ్రమాన్ని ప్రయోగశాలలో పరీక్షించగా.. బ్యాక్టీరియా కణాల పొరలను దెబ్బతీయడంతో పాటు వ్యాధిని కలిగించే జన్యువుల పనితీరును మార్చినట్లు గుర్తించారు. అలాగే బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకునే ప్రక్రియను కూడా ఈ మిశ్రమం అడ్డుకున్నట్లు సెప్టెంబర్‌ 3న 'mSphere'లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా సాధారణంగా ఉపయోగించే ఒకే రకం యాంటీబయాటిక్స్‌తో పోలిస్తే.. ఈ పురాతన ఔషధానికి బ్యాక్టీరియా చాలా నెమ్మదిగా నిరోధకతను పెంచుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

వివరాలు 

పలు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి.. రెసిస్టెన్స్‌ నెమ్మదించే అవకాశం

ఈ పరిశోధనలో వెలుగుచూసిన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ రెజీనా మైక్రోబయాలజిస్ట్‌ ఒమర్‌ ఎల్‌-హల్ఫావీ తెలిపారు.

ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్‌ ఫ్రేయా హారిసన్‌ ప్రకారం.. ఈ ఔషధం బ్యాక్టీరియాలోని ఒకే లక్ష్యంపై కాకుండా ఒకేసారి పలు లక్ష్యాలపై ప్రభావం చూపడం వల్లే రెసిస్టెన్స్‌ నెమ్మదిగా అభివృద్ధి చెంది ఉండొచ్చు.

బ్యాక్టీరియా సమూహం మనుగడ సాగించాలంటే ఒకేసారి అనేక లక్ష్యాల్లో మార్పులు రావాల్సి ఉంటుంది. అలా జరగడం అంత సులభం కాదని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

వెయ్యేళ్లుగా కొనసాగుతున్న బ్యాక్టీరియాతో పోరాటం

ప్రస్తుతం యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా మరణిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

అయితే వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో మనుషుల పోరాటం కొత్తది కాదు. ప్లేగు, కుష్ఠు, క్షయ వంటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులతో మానవులు వేల ఏళ్లుగా పోరాడుతున్నారు.

10వ శతాబ్దంలో ఆంగ్లో-సాక్సన్‌ రచయితలు వివిధ వైద్య చికిత్సలను 'Bald's Leechbook' అనే వైద్య గ్రంథంలో నమోదు చేశారు.

ఇందులో కొన్ని చికిత్సలకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. కొన్ని పద్ధతులు ఆధునిక పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి.

ADVERTISEMENT

వివరాలు 

బ్యాక్టీరియా జన్యువుల్లో కీలక మార్పులు!

2015లో హారిసన్‌తో పాటు మైక్రోబయాలజిస్టులు, చరిత్రకారుల బృందం ఈ గ్రంథంలో ఉన్న 'Bald's eyesalve' అనే ఔషధాన్ని ప్రయోగశాలలో తయారు చేసింది.

వెల్లుల్లి, ఉల్లిపాయ, పశువుల పిత్తం, వైన్‌ను ఇత్తడి పాత్రలో కలిపి తొమ్మిది రోజుల పాటు ఉంచారు.

ప్రయోగాల్లో ఈ మిశ్రమం 'Staphylococcus aureus'తో పాటు యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన MRSAపై కూడా ఆశ్చర్యకరమైన యాంటీమైక్రోబయల్‌ ప్రభావాన్ని చూపించింది.

తాజా పరిశోధనలో ఈ ఔషధం బ్యాక్టీరియాపై ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.

బ్యాక్టీరియా కల్చర్లలోని జన్యువుల పనితీరును పరిశీలించగా.. ఔషధం ఇచ్చిన తర్వాత 'Staphylococcus aureus'లో వందలాది జన్యువుల పనితీరులో మార్పులు కనిపించాయి.

ముఖ్యంగా కణ పొర నిర్మాణం, వ్యాధిని కలిగించే సామర్థ్యానికి సంబంధించిన జన్యువుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

బయోఫిల్మ్‌, సమాచార మార్పిడికి అడ్డుకట్ట

ఈ ఔషధ మిశ్రమం బ్యాక్టీరియా కణాల పొరలను కూడా దెబ్బతీసినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇది బ్యాక్టీరియాకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా తక్కువ మోతాదులోనే 'Staphylococcus aureus' బ్యాక్టీరియా బలమైన బయోఫిల్మ్‌లను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని తగ్గించింది.

బయోఫిల్మ్‌లు ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది.

మరోవైపు బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి సంకేతాలను పంపించుకునే ప్రక్రియను కూడా ఈ ఔషధం అడ్డుకుంది.

వ్యాధికారక బ్యాక్టీరియా తమ కార్యకలాపాలను సమన్వయం చేసుకుని మరింత ప్రమాదకరంగా మారేందుకు ఈ సమాచార మార్పిడి కీలకం.

వివరాలు 

పరిశోధనలో కీలక ఫలితాలు

అనంతరం 'Staphylococcus aureus'తో పాటు మరో రెండు రకాల వ్యాధికారక బ్యాక్టీరియాపై పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు.

సంప్రదాయ యాంటీబయాటిక్స్‌, 'Bald's eyesalve'ను వివిధ మోతాదుల్లో అందించి.. వాటికి బ్యాక్టీరియా ఎంత వేగంగా రెసిస్టెన్స్‌ పెంచుకుంటుందో పరిశీలించారు.

రెండు వారాల తర్వాత సంప్రదాయ యాంటీబయాటిక్‌ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం బ్యాక్టీరియాలో గణనీయంగా పెరిగింది.

మొదట బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకున్న మోతాదుతో పోలిస్తే 8 నుంచి 16 రెట్లు ఎక్కువ మోతాదును తట్టుకునే స్థాయికి అవి చేరాయి.

అయితే పురాతన ఔషధ మిశ్రమం విషయంలో మాత్రం బ్యాక్టీరియా కొద్దిగా ఎక్కువ మోతాదును మాత్రమే తట్టుకోగలిగింది.

వివరాలు 

పురాతన ఔషధం నుంచి ఆధునిక చికిత్సకు కొత్త మార్గం

అయితే ఈ పురాతన ఔషధాన్ని ఇంట్లో తయారు చేసుకుని ఇన్ఫెక్షన్లకు ఉపయోగించాలని పరిశోధకులు సూచించడం లేదు.

ఇలా తయారు చేయడం ఆచరణలో కష్టమే కాకుండా.. పదార్థాల నాణ్యత, మోతాదు మారిపోవడం వల్ల ఫలితాలు కూడా ఒకేలా ఉండకపోవచ్చని, ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హారిసన్‌ తెలిపారు.

బదులుగా ఈ ఔషధంలోని ప్రభావవంతమైన పదార్థాలను గుర్తించి.. వాటిలో కొన్నింటిని కలిపి ఆధునిక వైద్యానికి అనువైన ఔషధ మిశ్రమాన్ని అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

వెయ్యేళ్ల నాటి ఈ ఔషధంలో బ్యాక్టీరియాపై పలు మార్గాల్లో దాడి చేసే ఏ పదార్థాల కలయిక ఉందో గుర్తించడం భవిష్యత్తులో యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌కు కొత్త పరిష్కారాల అభివృద్ధికి ఉపయోగపడొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT