LOADING...
Comet: అంతరిక్షంలో అరుదైన ఖగోళ అద్భుతం.. ఇప్పుడు కాకుంటే మళ్లీ చూడలేం
అంతరిక్షంలో అరుదైన ఖగోళ అద్భుతం.. ఇప్పుడు కాకుంటే మళ్లీ చూడలేం

Comet: అంతరిక్షంలో అరుదైన ఖగోళ అద్భుతం.. ఇప్పుడు కాకుంటే మళ్లీ చూడలేం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడూ చూడలేని అరుదైన ఖగోళ అద్భుతం త్వరలో ఆకాశంలో కనువిందు చేయనుంది. సాధారణంగా మన జీవితకాలంలో 'తోకచుక్కలు' ఒక్కసారైనా కంటపడే అవకాశం చాలా అరుదు. అలాంటి ఒక ప్రత్యేకమైన తోకచుక్క భూ కక్ష్యకు సమీపంగా రాబోతోంది. C/2024 E1(వియర్జోష్)అనే ఈ తోకచుక్క త్వరలో ఆకాశంలో దర్శనమివ్వనుంది. ఈ తోకచుక్క సౌర కుటుంబం వెలుపలి ప్రాంతం నుంచి వచ్చినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2024 మార్చిలో పోలాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త 'కాస్పర్ వియర్జోష్' ఈ తోకచుక్కను కనుగొన్నారు. ఇది అత్యంత దూర ప్రాంతమైన 'ఓర్ట్‌ క్లౌడ్' నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఓర్ట్‌ క్లౌడ్‌లో కొన్ని లక్షల ఏళ్లుగా మంచు పదార్థంతో కూడిన ఖగోళ వస్తువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Details

మళ్లీ ఎందుకు చూడలేం..?

ఈ తోకచుక్క ప్రయాణ మార్గం సాధారణంగా లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావం కారణంగా ఇది సౌరకుటుంబం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే ఈ తోకచుక్కను జీవితంలో ఒక్కసారే చూడగలమని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కీలక తేదీలు ఈ తోకచుక్క జనవరి 20, 2026న సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చింది. అంతకుముందు జనవరి 1, 2026న శుక్రగ్రహానికి సమీపంగా ప్రయాణించింది. ఇక ఫిబ్రవరి 17, 2026న భూమి కక్ష్యకు అత్యంత దగ్గరగా రానుంది.

Details

తోకచుక్కలో ఏముంది..?

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, ఈ తోకచుక్కలో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు అధికంగా ఉంది. సాధారణంగా చాలా తోకచుక్కల్లో కనిపించే కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ఇందులో కనిపించలేదని తెలిపారు. దీని కేంద్ర భాగమైన న్యూక్లియస్ వెడల్పు సుమారు 2 నుంచి 10 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Details

ఎలా కనిపిస్తుంది..?

సూర్యుడికి దగ్గరగా వచ్చిన సమయంలో ఈ తోకచుక్క చుట్టూ వాయువు, ధూళితో కూడిన మేఘం ఏర్పడుతుంది. దాని వెంట పొడవైన తోక ఆకాశంలో స్పష్టంగా దర్శనమిస్తుంది. దీని ప్రకాశం 6.5 నుంచి 7 మ్యాగ్నిట్యూడ్‌ వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోపుల సహాయంతో దీనిని వీక్షించవచ్చు. ఫిబ్రవరి 2026 ప్రారంభంలో కూడా ఈ తోకచుక్క కనిపించే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో సూర్యాస్తమయం తర్వాత దక్షిణ-పడమర దిశలో తక్కువ ఎత్తులో ఈ ఖగోళ అద్భుతం దర్శనమివ్వొచ్చని ఖగోళ నిపుణులు వెల్లడించారు.

Advertisement