
Black Hole: నానోక్రాఫ్ట్‌తో కృష్ణబిళాల రహస్యాల వేట.. వందేళ్లలో బ్లాక్స్ హోల్స్ సమీపంలోకి పయనం
ఈ వార్తాకథనం ఏంటి
అపారమైన విశ్వ గర్భంలో ఉన్న కృష్ణబిళాలు (బ్లాక్ హోల్స్) ఎప్పటినుంచో శాస్త్రజ్ఞులకు అర్థం కాని రహస్యమే. వాటి ఉద్భవం, పరిణామం వంటి అంశాలను పూర్తిగా తెలుసుకుంటే విశ్వం ఎలా ఆవిర్భవించిందో, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో పెద్ద మొత్తంలో స్పష్టత వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే భూమి నుంచి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కృష్ణబిళాలకు చేరుకునే సాంకేతికత ఇప్పటివరకు అందుబాటులో లేదు.
వివరాలు
మరో 100 ఏళ్లలో కృష్ణబిళం వద్దకు వ్యోమనౌక
ఇప్పటి వరకు అలాంటి ప్రయాణాన్ని సాధించగల వ్యోమనౌకను ఎవరూ అభివృద్ధి చేయలేదు. కానీ ప్రముఖ అస్ట్రోఫిజిసిస్ట్ కాసిమో బాంబీ మాత్రం, ఇది సాధ్యమే అని ధైర్యంగా చెబుతున్నారు. ఆయన అంచనా ప్రకారం మరో 100 ఏళ్లలో కృష్ణబిళం వద్దకు వ్యోమనౌకను పంపే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఆ వ్యోమనౌక బరువు సాధారణ పేపర్‌క్లిప్ బరువుకన్నా తక్కువగా ఉండనుంది. ఇది ఒక నానోక్రాఫ్ట్‌గా రూపొందుతుంది. దీని ద్వారా కృష్ణబిళాల గూఢరహస్యాలను వెలికితీయవచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఐసైన్స్‌లో ప్రచురించబడ్డాయి.
వివరాలు
కాంతి వేగంలో మూడవ వంతు వేగం
కృష్ణబిళం వైపు దూసుకెళ్లే నానోక్రాఫ్ట్ శక్తివంతమైన లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. భూమి నుంచే దీన్ని నియంత్రించవచ్చు.ఇది కాంతి వేగంలో మూడవ వంతు వేగంతో ప్రయాణిస్తుంది. లక్ష్యానికి చేరుకోవడానికి వందేళ్లు పట్టే అవకాశం ఉంది. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా,భవిష్యత్తులో ఇది వాస్తవ రూపం దాల్చుతుందని బాంబీ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరో 20-30ఏళ్లలో ఈ ప్రాజెక్టు ప్రాక్టికల్‌గా మొదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేజర్,అంతరిక్ష ప్రయోగాల్లో రాబోయే ఆధునిక సాంకేతికతతో ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. కేవలం కొన్నిగ్రాముల బరువు కలిగిన ఈ నానోక్రాఫ్ట్‌లో మైక్రోచిప్,ఫోటాన్ బీమ్‌ల ద్వారా పనిచేసే లైట్ సెయిల్ అమర్చబడుతుంది. ఇది భూమి నుంచి 20-25కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కృష్ణబిళాలను పరిశీలిస్తుంది.
వివరాలు
భౌతికశాస్త్రంలో పెద్ద మలుపు
కృష్ణబిళాలను కంటి ముందు చూడటం అసాధ్యం, ఎందుకంటే అవి కాంతిని విడుదల చేయవు. సంప్రదాయ టెలిస్కోప్‌లతో వాటిని గుర్తించడం సాధ్యం కాదు. అందువల్ల పరిశోధనకు అనువైన బ్లాక్ హోల్ ఎంపిక చేయడం కూడా పెద్ద సవాలే. శాస్త్రవేత్తలు సాధారణంగా సమీప నక్షత్రాలపై కృష్ణబిళాల గురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిశీలించి వాటి స్థానాన్ని గుర్తిస్తారు. భూమి నుంచి సుమారు 25 కాంతి సంవత్సరాల దూరంలోని బ్లాక్ హోల్స్‌ను మరో పదేళ్లలో గుర్తించే అవకాశముందని చెబుతున్నారు. ఈ కృష్ణబిళాలపై నానోక్రాఫ్ట్ సేకరించే సమాచారం భౌతికశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని నిపుణుల అంచనా. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం వంటి ఫిజిక్స్ ప్రాథమిక సూత్రాలను, అంతరిక్షంలోని క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షించడానికి ఇది సహకరిస్తుంది.
వివరాలు
విశ్వంలోని అనేక రహస్యాలను వెలికితీసే అవకాశాలు పెరుగుతాయి
అత్యల్ప బరువు కలిగిన వ్యోమనౌకలను అంతరిక్షంలోకి పంపగల సాంకేతికత అందుబాటులోకి వస్తే, మరిన్ని కీలక పరిశోధనలకు ఇది ద్వారమవుతుందని, అలాగే విశ్వంలోని అనేక రహస్యాలను వెలికితీసే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.