Starlink: భారత్‌లో ప్రవేశానికి ముందు స్టార్‌లింక్ కీలక నిర్ణయం.. 2026లో శాటిలైట్ల ఎత్తు తగ్గుతోంది.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించే దిశగా ముందడుగు వేస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్,అంతరిక్ష భద్రతను మరింత పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి తమ శాటిలైట్ నెట్‌వర్క్ మొత్తం కక్ష్యను క్రమంగా తక్కువ ఎత్తుకు దించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భూమి చుట్టూ రోజు రోజుకీ పెరుగుతున్న శాటిలైట్ రద్దీ, అంతరిక్ష వ్యర్థ పదార్థాలను తగ్గించడమే ఈ చర్య ఉద్దేశమని స్టార్‌లింక్ తెలిపింది. స్టార్‌లింక్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మైకేల్ నికోల్స్ మాట్లాడుతూ, ప్రస్తుతం సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో పనిచేస్తున్న శాటిలైట్లను 2026లో క్రమంగా 480 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువస్తామని చెప్పారు.
వివరాలు
ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొత్త శాటిలైట్ల ప్రయోగం
శాటిలైట్లు భూమికి దగ్గరగా ఉంటే, అవి పని చేయడం ఆపిన వెంటనే భూమి వాతావరణంలోకి ప్రవేశించి త్వరగా కాలిపోయి పడిపోతాయని, దీంతో అవి అంతరిక్షంలో వ్యర్ధంగా మిగిలే ప్రమాదం తగ్గుతుందని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొత్త శాటిలైట్లు ప్రయోగం అవుతున్న నేపథ్యంలో, ఢీకొనే ప్రమాదాలు పెరుగుతున్నాయని కూడా తెలిపారు. ఈ ప్రకటనకు కొన్ని వారాల ముందు, స్టార్‌లింక్ ఒక అరుదైన అంతరిక్ష ఘటనను వెల్లడించింది. డిసెంబర్‌లో సుమారు 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తి, కొద్దిపాటి అవశేషాలు ఏర్పడ్డాయని ఆ శాటిలైట్‌తో పూర్తిగా సంబంధం తెగిపోయిందని కంపెనీ తెలిపింది.
వివరాలు
శాటిలైట్లు పరస్పరం ఢీకొనే అవకాశాలు
తక్కువ సమయంలోనే ఆ శాటిలైట్ సుమారు నాలుగు కిలోమీటర్లు కిందకు పడిపోవడం గమనించామని, లోపల ఏదైనా పేలుడు లేదా అంతర్గత వైఫల్యం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. ఇలాంటి ఘటనలు అరుదైనవే అయినప్పటికీ, భారీ శాటిలైట్ నెట్‌వర్క్‌లను ఎలా బాధ్యతగా నిర్వహించాలనే అంశంపై మళ్లీ చర్చకు దారి తీశాయి. శాటిలైట్ల కక్ష్యను తగ్గించడం వల్ల స్టార్‌లింక్ పనిచేసే పరిధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవుతుందని నికోల్స్ చెప్పారు. ప్రస్తుతం 500 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో అంతరిక్ష వ్యర్ధాలు తక్కువగా ఉన్నాయని, అలాగే భవిష్యత్‌లో అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఇతర శాటిలైట్ నెట్‌వర్క్‌లు కూడా తక్కువేనని తెలిపారు. దీని వల్ల శాటిలైట్లు పరస్పరం ఢీకొనే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
స్టార్‌లింక్ దాదాపు 10 వేల శాటిలైట్లను నిర్వహిస్తోంది
గత కొన్ని సంవత్సరాల్లో భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల సంఖ్య భారీగా పెరిగింది. స్టార్‌లింక్ ఒక్కటే దాదాపు 10 వేల శాటిలైట్లను నిర్వహిస్తోంది. దీంతో స్పేస్-X ప్రపంచంలోనే అతిపెద్ద శాటిలైట్ ఆపరేటర్‌గా నిలిచింది. ఒకప్పుడు కేవలం రాకెట్ ప్రయోగాలకే పరిమితమైన ఈ సంస్థ, ఇప్పుడు స్టార్‌లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ భద్రతా చర్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల మాట్లాడుతూ, భారత ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా నిబంధనలను పాటించిన తర్వాతే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు అనుమతి ఇస్తామని చెప్పారు.
వివరాలు
స్పెక్ట్రమ్ ధరలను ఖరారు చేసిన తర్వాతే తుదినిర్ణయం: స్పెక్ట్రమ్ ధరలను ఖరారు చేసిన తర్వాతే తుదినిర్ణయం
డేటా రూటింగ్, అంతర్జాతీయ గేట్‌వేలు జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, కీలక డేటా దేశంలోనే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధియా మాట్లాడుతూ,స్టార్‌లింక్,యూటెల్‌సాట్ వన్‌వెబ్,జియో శాటిలైట్ గ్లోబల్ సర్వీసెస్ వంటి సంస్థలకు స్పెక్ట్రమ్ కేటాయింపు దశకు ప్రభుత్వం దగ్గరపడుతోందన్నారు. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి స్పెక్ట్రమ్ ధరలను ఖరారు చేసిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే శాట్కామ్ సంస్థలకు తాత్కాలికంగా స్పెక్ట్రమ్ కేటాయించి,భద్రతా సంస్థల నిబంధనలను పాటిస్తున్నారా లేదా చూపించేందుకు అవకాశం ఇచ్చామని మంత్రి తెలిపారు. కంపెనీలు ప్రస్తుతం ఆ ప్రమాణాలను పూర్తి చేసే పనిలో ఉన్నాయని,అవి పూర్తయిన తర్వాత వాణిజ్య సేవలు ప్రారంభించే దిశగా ముందడుగు పడుతుందని ఆయన చెప్పారు.