Loading...
CERT-In issues 'critical' alert: భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు.. సైబర్‌ భద్రతపై ఆందోళన!
సైబర్‌ భద్రతపై ఆందోళన!

CERT-In issues 'critical' alert: భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు.. సైబర్‌ భద్రతపై ఆందోళన!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు (AI Agents) చొరబడి, కీలక సమాచారాన్ని యాక్సెస్‌ చేసినట్లు భారత సైబర్‌ భద్రతా సంస్థ సెర్ట్‌-ఇన్‌ (CERT-In) హెచ్చరించింది. ఇటీవల వివిధ కంపెనీలకు చెందిన ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు అనధికారికంగా ప్రవేశించినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. వ్యక్తిగత డేటా, రహస్య సమాచారం, ఇతర కీలక రికార్డులను అవి యాక్సెస్‌ చేసినట్లు తెలిపింది. పరిశోధనలు, ఏఐ మోడళ్ల పనితీరును మూల్యాంకనం చేసే సమయంలో ఈ ఏజెంట్లు తమకు నిర్దేశించిన పరిమితులను దాటినట్లు పేర్కొంది.

వివరాలు 

రెండు రకాల ఉల్లంఘనలను గుర్తించిన సెర్ట్‌-ఇన్

సెర్ట్‌-ఇన్‌ తన పరిశీలనలో రెండు రకాల ఉల్లంఘనలను గుర్తించింది. మొదటిది ఏఐ మోడళ్లకు సంబంధించినది.

ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసే సంస్థలు పరిశోధనలు, పనితీరు మూల్యాంకనాలు నిర్వహిస్తున్న సమయంలో వాటికి సంబంధించిన ఏజెంట్లు ఇతర కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు గుర్తించింది.

రెండోది సైబర్‌ దాడులకు సంబంధించినది. సైబర్‌ నేరగాళ్లు అనధికారికంగా కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ప్రవేశించేందుకు ఓపెన్‌ సోర్స్‌ ఏజెంటిక్‌ ఏఐ సాధనాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించినట్లు వెల్లడించింది.

ఈ ఘటనల్లో ప్రభావిత సంస్థలకు చెందిన సున్నితమైన సమాచారాన్ని ఏఐ ఏజెంట్లు యాక్సెస్‌ చేయగలిగాయని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది.

ఇందుకోసం అవసరమైన లాగిన్‌ వివరాలు, యాక్సెస్‌ అనుమతులు, కనెక్షన్‌ సెట్టింగ్‌లను పొందేందుకు సైబర్‌ భద్రతలోని లోపాలను ఉపయోగించుకున్నట్లు పేర్కొంది.

వివరాలు 

ప్రభావితమైన సంస్థల పేర్లను బయటపెట్టని సెర్ట్‌-ఇన్

ఈ విధంగా జరిగిన అనధికారిక ప్రవేశాలను బాధిత సంస్థలు గుర్తించలేకపోయాయని వెల్లడించింది.

అయితే, ఈ ఘటనలతో ప్రభావితమైన సంస్థల పేర్లను మాత్రం సెర్ట్‌-ఇన్‌ బయటపెట్టలేదు.

హ్యాకింగ్‌ ముప్పును నివారించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోని సంస్థలపై ఇటువంటి దాడులు పలుమార్లు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించకుండా చూడటంతోపాటు, ఇతర సమాచార భద్రతా లోపాలను సరిదిద్దాలని డెవలపర్లు, కంపెనీలకు సెర్ట్‌-ఇన్‌ సూచించింది.

ఏఐ ఏజెంట్లపై పరిశోధనలు నిర్వహించే సమయంలో అవి థర్డ్‌ పార్టీ కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ప్రత్యేక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని టెక్నాలజీ సంస్థలకు స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

'హగ్గింగ్‌ ఫేస్‌' సంస్థపై హ్యాకింగ్‌కు ప్రయత్నించిన ఓపెన్‌ ఏఐ ఏజెంట్లు

ఇదిలా ఉండగా, ఈ ఏడాది జులైలో 700 మోసపూరిత ఓపెన్‌ ఏఐ ఏజెంట్లు 'హగ్గింగ్‌ ఫేస్‌' సంస్థపై హ్యాకింగ్‌కు ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు చెందిన వెబ్‌సైట్‌లతోపాటు ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌లను కూడా ఏఐ ఏజెంట్లు యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ పరిణామాలు ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయడం, వినియోగించడంలో పటిష్ఠమైన సైబర్‌ భద్రతా చర్యలు ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT