Meta: AI మీకు రెండో మెదడు.. మెటా సంచలన ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
మెటా AI టీమ్ హెడ్ అలెగ్జాండర్ వాంగ్(Alexandr Wang) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు "పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్"దే అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన, రోజువారీ పనుల్లో సహాయపడే డిజిటల్ భాగస్వామిగా పనిచేసే టెక్నాలజీని తమ టీమ్ రూపొందిస్తోందన్నారు. భారత్‌లో ఈ టెక్నాలజీ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ChatGPT, Gemini వంటి AI సాధనాల కంటే ఇది ఎంతో ముందున్న వ్యవస్థ అని వివరించారు. ఇది మనకు రెండో మెదడులా పనిచేసి, మన తరఫున ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
వివరాలు
టెక్నాలజీపై గోప్యతకు సంబంధించిన ఆందోళనలు
సాధారణ AIలాగే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం కాదు, మన అలవాట్లు, పని తీరు, సంబంధాలు, లక్ష్యాలు వంటి వివరాలను అర్థం చేసుకుని ముందుగానే చర్యలు తీసుకుంటుందన్నారు. ఉదాహరణకు సెలవులు ప్లాన్ చేస్తే, మన ఇష్టాలు గమనించి టికెట్లు, హోటల్ బుకింగ్స్‌ను స్వయంగా పూర్తి చేస్తుందని చెప్పారు. అయితే ఈ టెక్నాలజీపై గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత డేటా మొత్తం AI దగ్గర ఉండటం వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే AI మనకు చూపించాలనుకున్న విషయాలనే చూపించే పరిస్థితి వస్తే, మన ఆలోచనలపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.