AI: ఏఐ సెల్ప్‌గా డెవలప్ అవుతుందా? ఆంథ్రోపిక్ హెచ్చరికల వెనుక అర్థమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సాంకేతిక సాధనంగా మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను చూశాం. ఇప్పుడు అదే ఏఐ తనను తాను మరింత శక్తిమంతంగా మార్చుకునే స్థాయికి చేరుకుంటుందా? టెక్ ప్రపంచంలో ఈ ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ తాజాగా చేసిన హెచ్చరికలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. తన తాజా S-1/A ఫైలింగ్‌లో సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏఐ సాయంతో మరింత సామర్థ్యం కలిగిన మోడళ్లను అభివృద్ధి చేసే ప్రక్రియ వేగవంతమవుతోంది. భవిష్యత్తులో ఈ పురోగతి మానవుల అంచనాలను కూడా దాటిపోయే అవకాశం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Details
ఆర్‌ఎస్‌ఐ అంటే ఏంటి? ఏఐ తనకు తానే శిక్షణ ఇచ్చుకుంటుందా?
ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పదం రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ (RSI). అంటే ఒక ఏఐ వ్యవస్థ తన సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి మరోసారి తన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగించుకోవడం.
ఉదాహరణకు, ఒక ఏఐ మోడల్ మరింత మెరుగైన ఏఐ మోడల్ తయారీకి అవసరమైన పరిశోధనలో సహాయపడితే, కొత్త మోడల్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఇలా ఒక దశ తర్వాత మరో దశలో సామర్థ్యాలు పెరుగుతూ పోవడాన్నే ఆర్‌ఎస్‌ఐ అంటారు. ఇది పూర్తిస్థాయిలో సాధ్యమైతే ఏఐ అభివృద్ధి వేగం అనూహ్యంగా పెరగవచ్చు. అయితే ఇది ఇప్పటికే జరిగిపోయిందని భావించకూడదు.
Details
ఆంథ్రోపిక్ హెచ్చరికల్లో అసలు విషయం ఇదే!
ఆంథ్రోపిక్ తన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏఐని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా వాటి భద్రతను పరీక్షించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని హెచ్చరించింది.
ముఖ్యంగా భవిష్యత్తులో తమ సంస్థ నిర్వచించిన 'డ్రామాటికల్లీ యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్ అట్రిబ్యూటబుల్ టు ఏఐ' స్థాయికి త్వరలో చేరవచ్చని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఉన్న ఏ మోడల్ కూడా ఆ పరిమితిని దాటలేదని స్పష్టం చేసింది.
Details
మనుషుల నియంత్రణ తప్పిపోతుందా?
ఏఐ తనను తాను అభివృద్ధి చేసుకునే స్థాయికి చేరితే అపారమైన ప్రయోజనాలు కలగవచ్చు.
వైద్య పరిశోధనలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి మరింత వేగంగా సాగవచ్చు.
అదే సమయంలో మానవుల పర్యవేక్షణ లేకుండా ఏఐ వ్యవస్థలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చు.
అందుకే ఏఐ అభివృద్ధిలో మనుషుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆంథ్రోపిక్ భావిస్తోంది.
భవిష్యత్తులో క్లాడ్ వంటి మోడళ్లతో వరుసగా కొత్త ఏఐ తరాలను పూర్తిగా స్వయంప్రతిపత్తితో రూపొందించడం సురక్షితం కాదని సంస్థ పేర్కొంది.
Details
ఏఐ భవిష్యత్తుపై ఇప్పుడే ఎందుకు చర్చించాలి?
ఆంథ్రోపిక్ వెల్లడించిన విషయాలను ఒకవైపు సాంకేతిక హెచ్చరికగా, మరోవైపు భవిష్యత్తు అవకాశాలపై సంకేతంగా చూడవచ్చు.
సంస్థలు తమ పెట్టుబడిదారులకు సమర్పించే S-1/A పత్రాల్లో వ్యాపార అవకాశాలతో పాటు ప్రమాదాలను కూడా వెల్లడిస్తాయి.
కాబట్టి ఈ ప్రకటనలను ఏఐ ఇప్పటికే మనుషుల నియంత్రణ దాటిందనే అర్థంలో తీసుకోకూడదు.
కానీ ఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ దాని భద్రత, బాధ్యత, నియంత్రణపై ముందుగానే స్పష్టమైన విధానాలు ఉండాలి.
సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, దాని దిశను నిర్ణయించే బాధ్యత మాత్రం మనుషుల చేతుల్లోనే ఉండాలి.