Loading...
Anthropic: ఆంత్రోపిక్‌లో కలకలం.. రెండు వారాల్లో ముగ్గురు కీలక సభ్యుల రాజీనామా
ఆంత్రోపిక్‌లో కలకలం.. రెండు వారాల్లో ముగ్గురు కీలక సభ్యుల రాజీనామా

Anthropic: ఆంత్రోపిక్‌లో కలకలం.. రెండు వారాల్లో ముగ్గురు కీలక సభ్యుల రాజీనామా

వ్రాసిన వారు Balachander Sharma
Nov 04, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న ఆంత్రోపిక్‌ సంస్థకు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రముఖ కోడింగ్‌ అసిస్టెంట్‌ 'క్లాడ్‌ కోడ్‌' అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సభ్యులు కేవలం రెండు వారాల వ్యవధిలో సంస్థను వీడారు. కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం టెక్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సంస్థలో వేగంగా జరుగుతున్న మార్పులు, ఉద్యోగుల నిష్క్రమణలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

Details

క్యాట్‌ వు ఎగ్జిట్‌.. ఎక్స్‌లో భావోద్వేగ పోస్ట్

క్లాడ్‌ కోడ్‌ అభివృద్ధిలో సీనియర్‌ సభ్యురాలిగా పనిచేసిన క్యాట్‌ వు తన నిష్క్రమణను సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించారు.

2024లో ఆంత్రోపిక్‌లో చేరిన ఆమె.. తొలిసారి క్లాడ్‌ కోడ్‌ ప్రారంభ రూపాన్ని ఉపయోగించినప్పుడే దాని సామర్థ్యానికి ఆకర్షితురాలయ్యారు.

ఒక చిన్న అంతర్గత ప్రాజెక్టుగా మొదలైన టూల్‌ను పరిశ్రమలో గుర్తింపు పొందిన ఉత్పత్తిగా తీర్చిదిద్దే ప్రయాణం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నారు.

సంస్థలో తనకు శుక్రవారమే చివరి రోజు అని వెల్లడించారు. అయితే, ఎందుకు వీడ్కోలు చెబుతున్నారో, తర్వాత ఏం చేయబోతున్నారో మాత్రం వివరించలేదు.

Details

వరుసగా బయటకు వచ్చిన మరో ఇద్దరు

క్యాట్‌ వు కంటే ముందే క్లాడ్‌ కోడ్‌ బృందానికి చెందిన థారిక్‌ షిహిపర్‌ సంస్థను వీడుతున్నట్లు ప్రకటించారు.

ఆంత్రోపిక్‌లో పనిచేసిన అనుభవం బాగుందని, సంస్థ లక్ష్యాలపై తనకు నమ్మకం ఉందని చెబుతూనే, కొత్త ప్రయాణం ప్రారంభించే ముందు కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇక డెస్క్‌టాప్‌ కోసం క్లాడ్‌ కోడ్‌ను రూపొందించిన ఆంథోనీ మోరిస్‌ కూడా సంస్థ నుంచి నిష్క్రమించారు.

ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను సాకారం చేసుకునేలా సాంకేతికత ఉపయోగపడాలనే ఉద్దేశంతో డెస్క్‌టాప్‌ వెర్షన్‌ను రూపొందించినట్లు ఆయన గతంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

Details

940 నుంచి 5,300కు పెరిగిన ఉద్యోగుల సంఖ్య

ఆంత్రోపిక్‌ సంస్థ విస్తరణ కూడా ఈ సమయంలో చర్చనీయాంశంగా మారింది. 2024 చివరి నాటికి సుమారు 940 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో, 2026 సెప్టెంబర్‌ నాటికి ఆ సంఖ్య దాదాపు 5,300కు చేరింది.

అంటే రెండేళ్లలోనే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు, ఈ నెలలోనే ఐపీఓకు వెళ్లే అవకాశాలపై సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇలాంటి కీలక సమయంలో ముగ్గురు అనుభవజ్ఞులు బయటకు వెళ్లడం సంస్థకు ఎలాంటి ప్రభావం చూపుతుంది? క్లాడ్‌ కోడ్‌ అభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలపై దాని ప్రభావం ఉంటుందా? అనేది చూడాలి.

అయితే, వారు సంస్థను వీడటానికి అసలు కారణాలు మాత్రం వెల్లడించలేదు.

ADVERTISEMENT