Apple: 2026లో కొత్త ఐప్యాడ్.. A18 చిప్‌తో భారీ అప్‌గ్రేడ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ తన ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌కు పెద్ద అప్‌గ్రేడ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో కొత్త ఐప్యాడ్‌ను విడుదల చేసే అవకాశముందని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ వెల్లడించారు. ఈ కొత్త మోడల్‌లో ప్రధానంగా చిప్‌సెట్ మార్పు ఉండనుంది. ప్రస్తుతం ఉన్న ఐప్యాడ్‌లో ఉన్న A16 చిప్ స్థానంలో, మరింత ఆధునికమైన A18 చిప్‌ను తీసుకురానున్నారు. ఈ మార్పుతో డివైస్ వేగం పెరగడం, పవర్ వినియోగం తగ్గడం మాత్రమే కాకుండా, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా సపోర్ట్ లభించనుంది.
వివరాలు
iOS 26.4 అప్‌డేట్‌తో వచ్చే అవకాశం
గుర్మన్ సమాచారం ప్రకారం, ఈ కొత్త ఐప్యాడ్ iOS 26.4 అప్‌డేట్ సైకిల్‌లో విడుదలయ్యే అవకాశముంది. ఈ అప్‌డేట్ మే నెల వరకు కొనసాగుతుంది. అదేవిధంగా, తర్వాత వచ్చే iOS 26.5 అప్‌డేట్‌తో సిరి మరింత స్మార్ట్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అప్‌గ్రేడ్ ద్వారా యాపిల్ తక్కువ ధరలో లభించే ఐప్యాడ్‌లో మొదటిసారిగా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందించనుంది. ఇప్పటి వరకు ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో లేకపోవడం గమనార్హం.
వివరాలు
C1 మోడమ్, N1 నెట్‌వర్కింగ్ చిప్ వచ్చే అవకాశం
A18 చిప్‌తో పాటు ఆపిల్ తన సొంతంగా తయారు చేసిన C1 మోడమ్, N1 నెట్‌వర్కింగ్ చిప్‌లను కూడా ఈ ఐప్యాడ్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. అయితే ఈ అంశంపై ఇంకా స్పష్టత లేదు. మొత్తంగా చూస్తే, ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా పనితీరు మెరుగుదలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కొత్త చిప్‌తో ఐప్యాడ్ మరింత వేగంగా పనిచేయడంతో పాటు కొత్త ఫీచర్లకు దారి తీసే అవకాశం ఉంది.