Apple: ఆలస్యమైన ఏఐ ఫీచర్లపై ఆపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ వినియోగదారులకు పరిహారం
ఈ వార్తాకథనం ఏంటి
ఐఫోన్‌లో ఏఐ, సిరి ఫీచర్ల విషయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదంటూ అమెరికాలో దాఖలైన కేసులో ఆపిల్ కీలక ఒప్పందానికి వచ్చింది. ఈ కేసును పరిష్కరించేందుకు 259 మిలియన్ డాలర్ల క్లాస్ యాక్షన్ సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. 2024లో విడుదల చేసిన ఐఫోన్ 16లో అధునాతన ఏఐ సామర్థ్యాలను అందిస్తామని ఆపిల్ ప్రచారం చేసిందని కేసులో ఆరోపణలు ఉన్నాయి. అయితే 2024లో సిరితో చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, జనరేటివ్ ఎమోజీ వంటి కొన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ప్రకటించిన అన్ని ఏఐ ఫీచర్లను ఆపిల్ అందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాలు
సోమవారం ప్రారంభమైన సెటిల్‌మెంట్ వెబ్‌సైట్
ఈ కేసుకు సంబంధించిన సెటిల్‌మెంట్ వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించారు.
పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేయడానికి 2026 డిసెంబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు.
2024 జూన్ 10 నుంచి 2025 మార్చి 29 మధ్యకాలంలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లేదా ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో ఏదైనా మోడల్‌ను కొనుగోలు చేసిన అమెరికా నివాసితులు మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు.
కొనుగోలు సమయంలో తమ ఫోన్‌లో కొన్ని సిరి ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తాము ఆశించామని, కానీ అవి అందలేదని కూడా వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వివరాలు
చెల్లింపులు ఆలస్యం కావొచ్చు
అర్హత ఉన్న వినియోగదారులకు ఒక్కో పరికరానికి సుమారు 25 డాలర్ల వరకు పరిహారం అందే అవకాశం ఉంది.
అయితే కొన్ని అంశాల ఆధారంగా ఈ మొత్తం మారవచ్చు. గరిష్ఠంగా ఒక్కో పరికరానికి 95 డాలర్ల వరకు పరిహారం లభించే అవకాశం ఉందని సెటిల్‌మెంట్ వివరాలు చెబుతున్నాయి.
ఈ మొత్తాన్ని భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ.8 వేల వరకు ఉంటుంది.
అయితే తుది మొత్తం, అర్హత తదితర అంశాలు కోర్టు నిర్ణయం, సెటిల్‌మెంట్ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.
వివరాలు
2027 ఫిబ్రవరి 24న తుది విచారణ
ఈ సెటిల్‌మెంట్‌కు తుది ఆమోదం కోసం 2027 ఫిబ్రవరి 24న కోర్టులో విచారణ జరగనుంది.
ఈ ఒప్పందం న్యాయమైనదా, సరైనదా అనే అంశంపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
కోర్టు నిర్ణయం అనంతరం అప్పీళ్లు దాఖలయ్యే అవకాశం కూడా ఉంది.
అదే జరిగితే అర్హత ఉన్న ఐఫోన్ వినియోగదారులకు పరిహారం చెల్లింపులు మరింత ఆలస్యం కావొచ్చని సెటిల్‌మెంట్ వివరాలు పేర్కొంటున్నాయి.