LOADING...
Apple: యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆపిల్ పెన్సిల్ బ్యాటరీ మార్చుకోవడం ఇక ఈజీ
యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆపిల్ పెన్సిల్ బ్యాటరీ మార్చుకోవడం ఇక ఈజీ

Apple: యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆపిల్ పెన్సిల్ బ్యాటరీ మార్చుకోవడం ఇక ఈజీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తన ఆపిల్ పెన్సిల్ స్టైలస్‌లకు కొత్త తరం మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం,ఈ కొత్త ఆపిల్ పెన్సిల్ మోడళ్లు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. 2027 వసంతకాలంలో రానున్న కొత్త ఐప్యాడ్ ప్రో మోడళ్లతో పాటు వీటిని ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త శ్రేణిలో యూఎస్‌బీ-సీ ఆపిల్ పెన్సిల్తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఆపిల్ పెన్సిల్ ప్రోకు అప్‌డేటెడ్ వెర్షన్లు ఉండనున్నాయని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆపిల్ పెన్సిల్ మోడళ్లలో బ్యాటరీని వినియోగదారులు స్వయంగా మార్చుకునే అవకాశం లేదు. అంతర్గతంగా ఎక్కువగా అంటుకునే పదార్థాలు(అడ్హెసివ్‌లు)ఉపయోగించడం వల్ల బ్యాటరీని మార్చడం చాలా క్లిష్టంగా ఉంటుంది.

వివరాలు 

ఈ మార్పుకు ప్రధాన కారణం..

అయితే కొత్తగా రానున్న ఆపిల్ పెన్సిల్ మోడళ్లలో ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. వీటిలో వినియోగదారులే సులభంగా బ్యాటరీని తీసి కొత్తదాన్ని అమర్చుకునేలా ప్రత్యేక బ్యాటరీ వ్యవస్థను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం యూరోపియన్ యూనియన్ (EU) తీసుకొచ్చిన కొత్త నిబంధనలేనని తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం,పోర్టబుల్ బ్యాటరీలతో పనిచేసే పరికరాల్లో ఉత్పత్తి జీవితకాలం మొత్తం వినియోగదారులే సులభంగా బ్యాటరీని తొలగించి మార్చుకునే వీలు ఉండాలి.

వివరాలు 

2027 ఫిబ్రవరి నుంచి నిబంధనలు అమల్లోకి..

ఈ నిబంధనలు 2023లో అమల్లోకి వచ్చినప్పటికీ, చట్టపరంగా 2027 ఫిబ్రవరి నుంచి పూర్తిగా అమలులోకి రానున్నాయి. మొదట ఈ నిబంధనలు ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, రీచార్జ్ చేయగల స్టైలస్‌లు, కీబోర్డులు, మౌస్‌లు, హెడ్‌ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకూ ఇవే వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టానికి అనుగుణంగా ఆపిల్ తన ఉత్పత్తుల్లో ఎలాంటి మార్పులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement