Loading...
Apple: కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల కోసం ఆపిల్ స్టోర్లలో భారీ మార్పులు
కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల కోసం ఆపిల్ స్టోర్లలో భారీ మార్పులు

Apple: కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల కోసం ఆపిల్ స్టోర్లలో భారీ మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తన రిటైల్ స్టోర్లలోని 'అవెన్యూస్' విభాగాన్ని కొత్తగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మార్పులు ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న సిరి ఆధారిత హోమ్‌పాడ్ ఉత్పత్తుల విడుదలకు సంకేతంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా స్టోర్ల చివరి భాగంలోని గోడల వెంట ఉండే 'అవెన్యూస్' విభాగంలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి ప్రధాన ఉత్పత్తులకు చెందినవి కాకుండా ఇతర పరికరాలు, యాక్సెసరీలను ప్రదర్శిస్తుంటారు. కొత్త స్మార్ట్ హోమ్ హార్డ్‌వేర్‌ను పరిచయం చేసే పెద్ద ప్రణాళికలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ పేర్కొన్నారు.

వివరాలు 

కొత్త ఉత్పత్తుల కోసం ఆపిల్ స్టోర్లలో మార్పులు

కొత్త ఉత్పత్తులకు స్థలం కల్పించేందుకు ఆపిల్ రిటైల్ బృందాలు 'అవెన్యూస్' విభాగాన్ని విస్తరించడంతో పాటు పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆపిల్ కొత్త ఉత్పత్తులను విడుదల చేసే సమయంలో స్టోర్లలో మార్పులు చేయడం సాధారణమే.

అయితే ఈసారి జరుగుతున్న మార్పుల స్థాయి చూస్తే కొత్తగా ఏదో రాబోతున్నట్లు తెలుస్తోంది.

స్మార్ట్ హోమ్ నెట్‌వర్క్‌కు కేంద్రంగా పనిచేసే 'హోమ్ హబ్' అనే కొత్త పరికరం కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని గుర్మన్ అంచనా వేస్తున్నారు.

వివరాలు 

హోమ్ హబ్‌తో కొత్త పరికరాల విభాగం

'హోమ్ హబ్' పూర్తిగా కొత్త కేటగిరీకి చెందిన పరికరంగా రానున్నట్లు సమాచారం.

స్మార్ట్ హోమ్ నెట్‌వర్క్‌లోని ఇతర పరికరాలను ఒకే చోట నుంచి నియంత్రించేందుకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది.

ఆపిల్ స్టోర్లలోని 'అవెన్యూస్' విభాగంలో హోమ్ హబ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది.

దాని పనితీరు, ఇతర స్మార్ట్ హోమ్ పరికరాలతో అది ఎలా పనిచేస్తుందో అక్కడ వినియోగదారులకు చూపించనున్నారు.

ఇక కొత్త హోమ్‌పాడ్ మినీ మాత్రం పూర్తిగా కొత్త డిజైన్‌తో కాకుండా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, సిరి ఏఐకి మద్దతు, వై-ఫై 7, బ్లూటూత్ 6 వంటి అప్‌గ్రేడ్లతో వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

రెండు వెర్షన్లలో హోమ్ హబ్

హోమ్ హబ్ రెండు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మోడల్ అర్ధ గోపురం ఆకారంలోని బేస్‌పై డిస్‌ప్లేతో ఉండనుంది.

మరో మోడల్‌ను గోడలకు ఏర్పాటు చేసే మౌంట్లు, ప్లింత్‌లకు అయస్కాంతం ద్వారా అమర్చుకునేలా రూపొందించనున్నట్లు సమాచారం.

ఇందులో 7 అంగుళాల చతురస్రాకార స్క్రీన్ ఉండనుంది. దీనిద్వారా స్మార్ట్ హోమ్ నెట్‌వర్క్‌లోని ఇతర పరికరాలను నియంత్రించవచ్చు.

నోట్స్, క్యాలెండర్, ప్రయాణ వివరాలు వంటి సమాచారాన్ని కూడా స్క్రీన్‌పై చూడొచ్చు. అంతేకాకుండా ఫొటో ఫ్రేమ్‌లా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇంటర్‌కామ్ వ్యవస్థగా, సెక్యూరిటీ కెమెరా వీక్షణ పరికరంగా, స్మార్ట్ లాక్ కంట్రోలర్‌గా కూడా ఇది పనిచేయనుంది. ఇందులో ఉండే కెమెరాతో ఫేస్‌టైమ్ వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఆపిల్ టీవీ 4కేలో అంతర్గత అప్‌గ్రేడ్‌కు అవకాశం

ఆపిల్ టీవీ 4కేలో కూడా కొత్త వెర్షన్‌ను తీసుకురావడానికి యాపిల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అయితే బయట డిజైన్‌లో పెద్ద మార్పులు చేయకుండా అంతర్గత హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

ఇందులో ఏ17 ప్రో లేదా అంతకంటే కొత్త చిప్‌ను అమర్చే అవకాశం ఉంది. దీంతో యాపిల్ టీవీ 4కేలో సిరి ఏఐ సేవలను ఉపయోగించుకునే వీలు కలగొచ్చని అంచనా.

కొత్త సిరి రిమోట్‌ను కూడా తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ రిమోట్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయనే దానిపై ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం లేదు.

ADVERTISEMENT