LOADING...
Apple: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబరులో లాంచ్
ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబరులో లాంచ్

Apple: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబరులో లాంచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఐఫోన్ అల్ట్రా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ హింజ్‌కు సంబంధించిన కీలక సాంకేతిక సమస్యలను విజయవంతంగా పరిష్కరించిన కంపెనీ ఇప్పుడు భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దక్షిణ కొరియా, తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరా సంస్థల సమాచారం ప్రకారం,ఐఫోన్ అల్ట్రా తుది ధృవీకరణ ప్రక్రియను కంపెనీ పూర్తిచేసింది. డిస్‌ప్లే,బాడీ డిజైన్,మెకానికల్ భాగాలతో పాటు ప్రధాన సాంకేతిక స్పెసిఫికేషన్లను కూడా ఖరారు చేసింది. ఆపిల్‌కు ఎన్నో ఏళ్లుగా తయారీ భాగస్వామిగా ఉన్న ఫాక్స్‌కాన్ జూలై చివరి నాటికి ఈ ఫోన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ అభివృద్ధి సమయంలో హింజ్‌కు సంబంధించి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి.

వివరాలు 

ఈ భాగాల తయారీలో 3డీ ప్రింటింగ్ సాంకేతికత

లక్షలాది సార్లు నిర్వహించిన మన్నిక పరీక్షల్లో హింజ్ నుంచి స్వల్ప శబ్దం వస్తున్నట్లు ఇంజినీర్లు గుర్తించారు. కొన్ని అసెంబ్లీ ప్రక్రియల్లో అనుకున్న దానికంటే ఎక్కువ టాలరెన్స్ ఉండటంతో లోపాల శాతం పెరిగిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం వాటిలో ఎక్కువ సమస్యలను ఆపిల్ విజయవంతంగా పరిష్కరించినట్లు సమాచారం. ఐఫోన్ అల్ట్రా కోసం హింజ్ మాడ్యూల్‌లను తైవాన్‌కు చెందిన షింజుక్సింగ్, అమెరికాకు చెందిన యాంఫెనాల్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఈ భాగాల తయారీలో 3డీ ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఫోల్డబుల్ OLED డిస్‌ప్లేలను శాంసంగ్ డిస్‌ప్లే తన వియత్నాం ప్లాంట్‌లో తయారు చేయనుండగా, ఉత్పత్తి పరిమాణాలకు ఆపిల్ ఇప్పటికే ప్రాథమిక ఆమోదం తెలిపింది.

వివరాలు 

ఐఫోన్ అల్ట్రాలో 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే

ఐఫోన్ అల్ట్రాలో 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇందులో A20 చిప్, C2 మోడెమ్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ సదుపాయంతో కూడిన పవర్ బటన్‌ను అందించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ టెక్ లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ప్రకారం, ఐఫోన్ అల్ట్రా రెండో తరం మోడల్‌కు కూడా ఆపిల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్లపై వివరాలు వెల్లడికాకపోయినా, డిస్‌ప్లే పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సమాచారం.

Advertisement