Apple: ఐఫోన్లు,ఐప్యాడ్‌లలో గూగుల్ కాస్ట్.. యూజర్లకు కొత్త ఫీచర్ తీసుకురానున్న ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో పెద్ద మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపిల్ డివైస్‌లలో వీడియోలు, ఫొటోలు, ఆడియోలను ఇతర టీవీలు లేదా స్పీకర్లకు స్ట్రీమ్ చేయడానికి 'ఎయిర్‌ప్లే'(AirPlay)సేవను ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ ప్రోటోకాల్స్‌కూ అవకాశం ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ కథనం ప్రకారం, ఆపిల్ iOS 27లో థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ సపోర్ట్‌పై పని చేస్తోంది. దీని ద్వారా గూగుల్ అందించే 'గూగుల్ కాస్ట్'(Google Cast)సేవను డిఫాల్ట్ స్ట్రీమింగ్ ఆప్షన్‌గా సెట్ చేసుకునే అవకాశం యూజర్లకు లభించనుంది. దీంతో ఐఫోన్ లేదా ఐప్యాడ్ నుంచి నేరుగా స్మార్ట్ టీవీలు,స్పీకర్లకు కంటెంట్ స్ట్రీమ్ చేయడం మరింత సులభం కానుంది.
వివరాలు
యూరప్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం
ఈ కొత్త ఫీచర్ ప్రధానంగా యూరోపియన్ యూనియన్ (EU) దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. యూరోపియన్ యూనియన్ అమలు చేస్తున్న డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ (DMA) నిబంధనల ప్రకారం ఆపిల్ ఈ మార్పులు చేయాల్సి వస్తోంది. ఇదే తరహాలో ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్ స్టోర్లకు కూడా ఆపిల్ EUలో అనుమతులు ఇచ్చింది. ఈ మార్పుతో భవిష్యత్తులో స్మార్ట్ స్పీకర్లు, స్ట్రీమింగ్ డివైస్ తయారీ సంస్థలు AirPlay సపోర్ట్ లేకుండానే iOSతో నేటివ్‌గా పనిచేసే అవకాశముంది. దీంతో యూజర్లకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.