Billionaire CEO: ప్రమోషన్ ఇవ్వాలా? AIనే నిర్ణయిస్తుంది.. ఉద్యోగుల పనితీరుపై కొత్త ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగి పనితీరును బట్టి ఇంక్రిమెంట్ ఎంత ఇవ్వాలి? ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా ఇలాంటి నిర్ణయాలను మేనేజర్లు తీసుకుంటారు. ఉద్యోగి పనితీరు, నాయకత్వ సామర్థ్యం, పని తీరు వంటి అంశాలను పరిశీలించి వారు తుది నిర్ణయానికి వస్తారు. అయితే ఓ బిలియనీర్‌కు చెందిన కంపెనీలో మాత్రం ఈ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. ఫుడ్-టెక్ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త మార్క్ లోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ సంస్థలో ఉద్యోగులకు ప్రమోషన్లు ఎవరికి ఇవ్వాలనే అంశంపై AI ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
12 మంది సహోద్యోగుల అంచనా
Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన AI వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.
ఇందులో ఉద్యోగితో కలిసి పనిచేసే సహోద్యోగుల అభిప్రాయాలు, పనితీరు అంచనాలు, నాయకత్వ లక్షణాలు, ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక్కో ఉద్యోగి పనితీరును కనీసం 12 మంది సహోద్యోగులు వివిధ అంశాల ఆధారంగా అంచనా వేస్తారు.
వారు ఇచ్చే రేటింగ్‌లతో పాటు రాతపూర్వక ఫీడ్‌బ్యాక్‌ను కూడా AI వ్యవస్థలోకి పంపిస్తారు.
ఈ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఉద్యోగి పనితీరుపై AI ఒక సమగ్ర నివేదికను రూపొందిస్తుంది.
వివరాలు
VAR స్కోర్ కూడా కీలకమే
పనితీరు అంచనాతో పాటు Wonder మరో ప్రత్యేక ప్రమాణాన్ని కూడా ఉపయోగిస్తోంది.
అదే 'Value Above Replacement' (VAR). ఒక ఉద్యోగి స్థానంలో అదే స్థాయి సామర్థ్యం ఉన్న మరో వ్యక్తిని తీసుకురావడం ఎంత కష్టమో అంచనా వేయడమే ఈ మెట్రిక్ ఉద్దేశం.
ఉద్యోగి పనితీరు స్కోర్‌తో పాటు VAR స్కోర్‌ను కూడా AI పరిశీలిస్తుంది.
ఈ రెండు అంశాలతో పాటు ఇతర పనితీరు సమాచారాన్ని విశ్లేషించి ప్రమోషన్‌కు అర్హులైన ఉద్యోగులను AI సిఫార్సు చేస్తుంది.
దీంతో మేనేజర్ వ్యక్తిగత అభిప్రాయం ఆధారంగా కాకుండా డేటా ఆధారంగా ప్రమోషన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మార్క్ లోర్ భావిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల నిర్ణయాల్లో మరింత నిష్పాక్షికత రావచ్చని ఆయన అభిప్రాయం.
వివరాలు
AI సిఫార్సే తుది నిర్ణయం కాదు
అయితే AI సూచించిన ఉద్యోగికే ప్రమోషన్ ఇవ్వాలనే నిబంధన లేదు.
AI మోడల్ ఏదైనా ముఖ్యమైన సందర్భాన్ని లేదా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని మేనేజర్లు భావిస్తే..దాని సిఫార్సును మార్చుకునే అవకాశం వారికి ఉంటుంది.
అయితే కంపెనీ వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతున్న కొద్దీ AI సిఫార్సులతో మేనేజర్లు విభేదించే సందర్భాలు తగ్గుతున్నాయని మార్క్ లోర్ తెలిపారు.
మేనేజర్ల వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాతాలు ప్రమోషన్ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళలు,మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగుల విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలతో చేసే అంచనాలు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని అన్నారు.
అందుకే ఉద్యోగులందరి పనితీరును ఒకే రకమైన ప్రమాణాలతో అంచనా వేయడం ద్వారా ప్రమోషన్ ప్రక్రియలో పారదర్శకత,సమానత్వాన్ని పెంచవచ్చని Wonder భావిస్తోంది.
వివరాలు
జీతాల విషయంలోనూ పారదర్శకత
Wonderలో డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఈ విధానం ద్వారా స్పష్టమవుతోంది.
సంస్థలో ఉద్యోగుల స్థాయిలను కూడా తైక్వాండో బెల్ట్ ర్యాంకింగ్స్ తరహాలో వివిధ రంగులతో గుర్తించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఇదే సమయంలో ఉద్యోగుల వేతనాల విషయంలోనూ కంపెనీ పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోంది.
తమ సహోద్యోగులు ఎంత జీతం పొందుతున్నారో ఉద్యోగులు తెలుసుకునేలా పారదర్శకమైన పరిహార విధానాన్ని అమలు చేస్తోంది.
వివరాలు
ఉద్యోగుల భవిష్యత్తును AI నిర్ణయిస్తుందా?
పనితీరు అంచనాలు, ప్రమోషన్లు వంటి ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో AI వినియోగం కార్పొరేట్ ప్రపంచంలో కొత్త చర్చకు తెరతీస్తోంది.
మానవులు తీసుకునే నిర్ణయాల్లో ఉండే వ్యక్తిగత పక్షపాతాన్ని తగ్గించడంలో AI ఉపయోగపడుతుందని కొందరు భావిస్తున్నారు.
ఉద్యోగులందరినీ ఒకే ప్రమాణాలతో అంచనా వేయడం ద్వారా మరింత నిష్పాక్షికమైన నిర్ణయాలు తీసుకోవచ్చని వారు చెబుతున్నారు.
అయితే ఉద్యోగి పనితీరును కేవలం డేటా ఆధారంగా అంచనా వేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.
వివరాలు
ఉద్యోగుల భవిష్యత్తును AI నిర్ణయిస్తుందా?
ఉద్యోగి ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితులు, వ్యక్తిగతంగా కనిపించని ఇతర అంశాలను AI పూర్తిగా అర్థం చేసుకోగలదా అనే సందేహాలు కూడా ఉన్నాయి.
ప్రమోషన్‌కు ఎవరిని సిఫార్సు చేయాలో AI నిర్ణయించడం వరకు సరే కానీ.. తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం మేనేజర్లకే ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మేనేజర్ల వ్యక్తిగత పక్షపాతాలకు అవకాశం లేకుండా, ఒకే ప్రమాణాలతో పూర్తిగా పారదర్శకంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలంటే AIనే మెరుగైన మార్గమని మరికొందరు భావిస్తున్నారు.