Samudrayaan: 2025 చివరి నాటికి సముద్రయాన్ చేపడుతాం: మంత్రి కిరణ్ రిజిజు
చంద్రుడిపై మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన భారత్ ఇప్పుడు లోతైన సముద్రంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. 2025 చివరి నాటికి సముద్రయాన్‌ను చేపట్టాలని భారత్ భావిస్తున్నట్లు ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో ఉన్న సముద్రాన్ని అధ్యయనం చేయడానికి భారతదేశం తన శాస్త్రవేత్తలను పంపేందుకు ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు. 'మత్స్య 6000(Matsya6000)' జలాంతర్గామి సాయంతో సముద్రం కింద 6,000 మీటర్ల లోతుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ రిజిజు ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పరీక్షించనున్నారు.
రష్యా, చైనా, ఫ్రాన్స్ సరసన చేరనున్న భారత్
మత్స్య (Matsya6000) జలాంతర్గామి అనేది మనుషులను సముద్రం లోపలికి తీసుకెళ్తుందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తాను సమీక్షించానని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి శాస్త్రవేత్తలు మొదటి నిస్సార నీటి పరీక్షను నిర్వహిస్తారని మంత్రి వెల్లడించారు. సముద్రయాన్ మిషన్ సన్నద్ధతను 2021లో ప్రారంభించారు. ఈ మిషన్‌లో మత్స్య 6000ని ఉపయోగించి మధ్య హిందూ మహాసముద్రంలోని సముద్రపు అడుగుభాగానికి 6,000 మీటర్ల లోతుకు వెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మిషన్‌లో ముగ్గురిని సముద్రంలోకి పంపనున్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు సమద్రయాన్ యాత్రలను విజయవంతంగా నిర్వహించాయి. భారత్ ఇప్పుడు ఈ విషన్‌ను విజయవంతం చేస్తే.. ఆయా దేశాల సరసన చేరుతుంది.