ISRO: మనం కచ్చితంగా విజయం సాధిస్తాం: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ కామెంట్స్
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 మిషన చంద్రుడిపై దిగనున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ ఈ ప్రయోగంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పారు. చంద్రయాన్-3 మిషన్ కచ్చితంగా విజయవంతమవుతుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు ఇస్రో చీఫ్ చెప్పారు. 2019లో చంద్రయాన్-2 విఫలమైన తర్వాత, గత నాలుగు సంవత్సరాలుగా మా బృందాలు దీనికోసం కష్టపడి కసితో పనిచేశాయన్నారు. నాలుగేళ్లు అంటే తక్కువ సమయం కాదని, అన్ని వ్యవస్థలను పకడ్బందీగా సిద్ధం చేసినట్లు సోమ్‌నాథ్ వెల్లడించారు. ప్రతి బీట్‌కు బ్యాకప్ ప్లాన్‌ను రెడీ చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
అన్నీ అనుకున్నటుగానే జరిగాయి: సోమ్‌నాథ్
చంద్రయాన్-3 మిషన్‌లో ఇప్పటి వరకు ప్రతిదీ తాము అనుకున్నట్లుగా జరిగినట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వివరించారు. వాస్తవానికి తాము ఈ ప్రయోగంలో అదనపు ప్రయోజనాలను కూడా పొందినట్లు ఆయన వివరించారు. తమ ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యలో ఉండి మూడు నుంచి ఆరు నెలల పాటు దాని స్వంత ప్రయోగాలు చేయగలిగేలా తాము మొదట అనుకున్నట్లు చెప్పారు. కానీ దానికి అదనపు ఇంధనం జోడించడం వల్ల ప్రొపల్షన్ మాడ్యూల్ ఇప్పుడు చాలా సంవత్సరాల పాటు కక్ష్యలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రయాన్-2 చివరి దశ వరకు బాగానే సాగిందని, కానీ సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయామని ఎస్.సోమనాథ్ తెలిపారు. అధిక వేగంతో ల్యాండ్ కావడం వల్లే తాము చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయినట్లు చెప్పుకొచ్చారు.
చంద్రయాన్-3 తర్వాత మరికొన్ని ప్రతిష్ఠాత్మక ప్రయోగాలు: సోమ్‌నాథ్
చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో జరిగిన ఆ లోపాలను సవరించుకొని, అవి పునరావృతం కాకుండా చూసుకున్నామని సోమ్‌నాథ్ పేర్కొన్నారు. చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో ఎలాంటి తప్పులు జరగవని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో ఇస్రో సామర్థ్యాన్ని నిరూపించుకున్నామని వివరించారు. మేము చాలా తక్కువ ఖర్చుతో అన్వేషణాత్మక మిషన్‌లను విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. చంద్రయాన్-3 తర్వాత మరికొన్ని ప్రతిష్ఠాత్మక మిషన్లు చేపట్టనన్నట్లు వివరించారు.