చంద్రయాన్-3: 100కిలోమీటర్లు దాటి దగ్గరవుతున్నప్పుడే ఇబ్బంది అంటున్న ఇస్రో ఛైర్మన్
ఇస్రో పంపించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సక్రమంగా పనిచేస్తుందని, అనుకున్న ప్రకారం కక్ష్య కుదింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రయాన్-3 మిషన్ హెల్త్ సరిగ్గానే ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న చంద్రయాన్-3, చంద్రుడికి 100కిలోమీటర్ల ఎత్తువరకు సులభంగా ప్రయాణిస్తుందని. ఇంకా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చంద్రుడి ఉపరితలం మీద దిగే సమయమే అత్యంత క్లిష్టమైనదని ఎస్ సోమనాథ్ తెలియజేసారు. ఆ 100కిలోమీటర్ల ప్రయాణంలో చంద్రయాన్-3, చంద్రుడికి ఎంత ఎత్తులో ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని, అది సక్రమంగా జరిగినపుడే అనుకున్నట్లుగా చంద్రుడి మీద సురక్షితంగా దిగుతుందని సోమనాథ్ వెల్లడి చేసారు.
మేలు చేసిన చంద్రయాన్-2 అనుభవాలు
ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయాణం సాఫీగా సాగడానికి తమకు చంద్రయాన్-2 ప్రయోగంలోని అనుభవాలు ఎంతో సహకరించాయని సోమనాథ్ తెలియజేసారు. చంద్రయాన్-2 లో చేసిన పొరపాట్లు ఏవి చంద్రయాన్-3 లో జరగకుండా చూసుకున్నట్లు సోమనాథ్ తెలిపారు. చంద్రుడి మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు శ్రీహరి కోట నుండి జులై 14వ తేదీన బయలుదేరిన చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆగస్టు 9, 17 తేదీల్లో కక్ష్య కుదింపు చర్యలు ఉండనున్నాయని, ఆ తర్వాత ఆగస్టు 23వ తేదీన చంద్రుడి మీద చంద్రయాన్-3 ల్యాండ్ కానుందని సమాచారం.