Chernobyl's mystery: ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న చెర్నోబిల్ 'నీలిరంగు కుక్కలు'… నిజమా? లేక AI సృష్టించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం వద్ద నీలిరంగు మోముతో తిరుగుతున్న వీధి కుక్కల వీడియో ఇప్పుడు ప్రపంచమంతా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చెర్నోబిల్ పరిసరాల్లో వదిలిపెట్టబడిన జంతువులను చూసుకునే 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' అనే స్వచ్ఛంద సంస్థ షేర్ చేయగా, కేవలం కొన్ని రోజుల్లోనే ఇది మూడు లక్షలకుపైగా వీక్షణలు సాధించింది. 1986లో జరిగిన అణు ప్రమాదం తర్వాత కూడా చెర్నోబిల్‌లో జీవం ఎలా నిలబడి ఉందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
వివరాలు
అర్థం కాని ఆ వైరల్ వీడియో
వీడియోలో మూడు కుక్కలు నీలం రంగుతో మెరుస్తూ విద్యుత్ కేంద్రం పరిసరాల్లో తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఆ సంస్థ తెలిపినట్లుగా, ఈ కుక్కలు శస్త్రచికిత్స కోసం చేపట్టిన ఒక కార్యక్రమంలో అనుకోకుండా కనిపించాయి. "మేము పూర్తిగా నీలిరంగులో ఉన్న మూడు కుక్కలను చూశాం. ఏమైందో మాకు అర్థం కావడం లేదు," అని ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. స్థానికులు మాత్రం "ఇవే కుక్కలు వారం క్రితం వరకు సాధారణంగా కనిపించాయి" అంటుండటంతో మిస్టరీ మరింతగా పెరిగింది.
వివరాలు
చెర్నోబిల్ నీలి కుక్కలు నిజంగానే ఉన్నాయా? లేక AI మాయాజాలమా?
ఇటీవల సోషల్‌మీడియాలో AIతో తయారైన వన్యప్రాణి వీడియోలు విపరీతంగా పెరగడంతో, చాలా మంది ఈ వీడియో నిజమా కాదా అని సందేహిస్తున్నారు. అయితే డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ బృందం మాత్రం "ఇది నిజమైన వీడియో" అని చెబుతోంది. "మేము ఆ కుక్కలను పట్టుకుని పరీక్షలు చేయాలని చూస్తున్నాం. అవి ఏదో రసాయన పదార్థంతో సంబంధం కలిగి ఉండొచ్చు," అని ఆ సంస్థ స్పష్టం చేసింది. వింతగా కనిపిస్తున్నా ఆ కుక్కలు బాగానే చురుకుగా, ఆరోగ్యంగా ఉన్నాయట.
వివరాలు
చెర్నోబిల్ విపత్తు తరువాతి తరం జీవులు
ఇప్పటి ఈ కుక్కలు, 1986 ఏప్రిల్‌లో చెర్నోబిల్ రియాక్టర్ పేలిన తర్వాత ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టినప్పుడు వదిలేసిన పెంపుడు జంతువుల సంతానం. 2017 నుంచి 'క్లీన్ ఫ్యూచర్స్ ఫండ్' ఆధ్వర్యంలోని 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' సంస్థ ఈ ప్రాంతంలో సుమారు 700కు పైగా కుక్కలకు ఆహారం, వైద్య సహాయం, శస్త్రచికిత్స వంటి సేవలను అందిస్తోంది. అణు ప్రమాదం తర్వాత వన్యప్రాణులు ఎలా మారిపోయాయి? ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా మానవులకు ప్రమాదకరమైన రేడియేషన్ స్థాయులు ఉన్నప్పటికీ, ప్రకృతి తనదైన రీతిలో తిరిగి జీవాన్ని సృష్టించుకుంది. మనుషులు దూరంగా ఉండడంతో అక్కడి అడవుల్లో ఇప్పుడు తోడేళ్లు, అడవి ఎద్దులు, గద్దలు కూడా తిరుగుతున్నాయి.
వివరాలు
నీలి రంగు వెనుక రహస్యం
2024లో కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో, చెర్నోబిల్ ప్రాంతంలోని ఈ కుక్కల్లో దీర్ఘకాలిక రేడియేషన్, లోహ కాలుష్యానికి తట్టుకునే ప్రత్యేక జెనిటిక్ మార్పులు ఉన్నాయని గుర్తించారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ రంగు వారసత్వంగా (genetic) కాకుండా రసాయన ప్రభావం వల్ల వచ్చి ఉండొచ్చు. కోబాల్ట్, కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక వ్యర్థాలు కలిగిన నేల లేదా నీటిని ఈ కుక్కలు తాకడం వలన వాటి బొచ్చు నీలం రంగు పట్టి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. కుక్కలను పట్టుకుని పరీక్షించే వరకు ఈ మిస్టరీకి సమాధానం దొరకదు.
వివరాలు
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రదేశం
ఈ వీడియో సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.నెటిజన్లు వందలాది కామెంట్లు పెడుతూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు"ఇది బయట నుంచి తగిలిన ఏదో రసాయన పదార్థం వల్లే నీలం రంగు వచ్చిందేమో"అని అనగా,మరికొందరు సరదాగా "చెర్నోబిల్ కుక్కలూ ఇప్పుడు రేడియేషన్ స్మర్ఫ్‌లా మారిపోయాయి!" అంటూ జోకులు వేశారు. శాస్త్రవేత్తల దృష్టిలో ఈ నీలిరంగు కుక్కలు కేవలం వైరల్ వీడియోలోని ఆశ్చర్యం మాత్రమే కాదు.. జీవం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా ఎలా నిలబడగలదో చూపించే సాక్ష్యం. దాదాపు నలభై సంవత్సరాల తర్వాత కూడా ఈ జంతువులు ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రదేశంలో జీవించగలుగుతున్నాయి. నీలిరంగు వెనుక కారణం ఇంకా తెలియకపోయినా,చెర్నోబిల్ కుక్కలు జీవం ఎంత ప్రమాదంలోనైనా తట్టుకుని బ్రతకగలదని మరోసారి నిరూపించాయి.