Cicada COVID Variant: కొవిడ్ కొత్త వేరియంట్ 'సికాడా'.. అమెరికా సహా 20కిపైగా దేశాల్లో విస్తరణ.. కరోనా మళ్లీ పెరుగుతుందా..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు 'సికాడా'(BA.3.2)అనే కొత్త వేరియంట్ రూపంలో ఇది అనేక దేశాల్లో కనిపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అమెరికా సహా 20కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ కారణంగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. అయినప్పటికీ, ఆరోగ్యశాఖ అధికారులు పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ సికాడా (BA.3.2) వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే. 2022లో తగ్గుముఖం పట్టిన ఒమిక్రాన్ జాతి ఇప్పుడు మళ్లీ మార్పులు చెంది కొత్త రూపంలో బయటపడింది. ముఖ్యంగా దీని స్పైక్ ప్రోటీన్‌లో 70 నుంచి 75కిపైగా మ్యుటేషన్లు నమోదవడం నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాలు
మొదటగా అమెరికాలో కొత్త వేరియంట్
సాధారణంగా గతంలో వచ్చిన కొవిడ్ వేరియంట్లతో పోలిస్తే,ఈ సికాడా వేరియంట్‌లో ఉన్న మార్పులు భిన్నంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో తీసుకున్న వ్యాక్సిన్లు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల శరీరంలో ఏర్పడిన యాంటీబాడీల నుంచి ఇది సులభంగా తప్పించుకునే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే, పాత ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఇది మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వైరస్‌లో జరిగిన ఈ ఉత్పరివర్తనాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ మొదటగా అమెరికాలో గుర్తించబడింది. అనంతరం యూరప్,ఆసియా దేశాల్లో కూడా దీని కేసులు వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
భారత్'లో అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అయితే ఇప్పటివరకు ఈ వేరియంట్ కారణంగా భారీ స్థాయిలో కేసులు పెరిగినట్టు ఎక్కడా నమోదుకాలేదు. లక్షణాల విషయానికి వస్తే, సికాడా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ కనిపిస్తున్నాయి. కొందరికి తలనొప్పి, ఒళ్లునొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. అయితే ఈ BA.3.2 వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందనే స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతం లేవని నిపుణులు చెబుతున్నారు. భారత్ పరిస్థితిని పరిశీలిస్తే, ఇప్పటికైతే ప్రజలు అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, అప్రమత్తంగా ఉండడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.