Digital Nose: వారెవ్వా...ఫొటోలు, వీడియోలే కాదు వాసనలు కూడా ఆన్‌లైన్‌లో పంపొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు.. ఇక వాసనలను కూడా ఇంటర్నెట్ ద్వారా పంపుకునే రోజులు రావచ్చు. ఒక చోట ఉన్న వస్తువు వాసనను గుర్తించి, ఆ సమాచారాన్ని డిజిటల్ రూపంలో మరోచోటికి పంపి, అక్కడ అదే తరహా వాసనను సృష్టించే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 'సెంట్రానిక్' (Scentronic) పేరుతో రూపొందించిన ఈ వ్యవస్థ డిజిటల్ కమ్యూనికేషన్‌లో సరికొత్త అవకాశాలకు తెరతీస్తోంది.
Details
డిజిటల్ ముక్కు ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా మనం ఇంటర్నెట్‌లో ఫొటోలు, వీడియోలు, ఆడియోలను పంపుకుంటాం. కానీ ఒక పెర్ఫ్యూమ్ వాసనను ఆన్‌లైన్‌లోనే పసిగట్టగలిగితే? కాఫీ సువాసనను దూరంలో ఉన్న వ్యక్తికి అందించగలిగితే? ఇలాంటి ఆలోచనలకు ఆచరణాత్మక రూపం ఇచ్చే దిశగా ఈ పరిశోధన సాగింది.
సెంట్రానిక్ వ్యవస్థలో ఆరు గ్యాస్ సెన్సర్లతో కూడిన ఎలక్ట్రానిక్ ముక్కు ఉంటుంది. కాఫీ, పండ్లు, పెర్ఫ్యూమ్ వంటి వస్తువుల నుంచి వెలువడే వాసనకు కారణమైన రసాయన సమ్మేళనాలను ఈ సెన్సర్లు గుర్తిస్తాయి. ప్రతి వాసనకు అనుగుణంగా ఏర్పడే విద్యుత్ సంకేతాలను డిజిటల్ సమాచారంగా మారుస్తారు.
Details
డేటా ఆధారంగా వాసన గుర్తింపు
తర్వాత కృత్రిమ మేధ (AI) సహాయంతో ఆ సమాచారాన్ని విశ్లేషించి, అది ఏ వాసనకు సంబంధించినదో గుర్తిస్తారు. ఈ డేటాను ఇంటర్నెట్ ద్వారా మరో ప్రాంతంలోని పరికరానికి పంపిస్తారు.
అక్కడ ప్రత్యేకంగా నిల్వ చేసిన సువాసన ద్రవాలను ఉపయోగించి, అసలు వాసనను పోలిన పరిమళాన్ని విడుదల చేస్తారు.
Details
96 శాతం కచ్చితత్వం
ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగాత్మక దశలోనే ఉంది. కాఫీ, కేక్, నారింజ, బీర్, రెడ్ వైన్.. ఇలా ఐదు రకాల వాసనలను గుర్తించి, తిరిగి సృష్టించగలిగింది.
పరీక్షల్లో ఈ ఐదు వాసనలను 96 శాతం కచ్చితత్వంతో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాసన నిజంగా ఇంటర్నెట్‌లో ప్రయాణించదు. దానికి సంబంధించిన డిజిటల్ సమాచారం మాత్రమే వెళ్తుంది.
అవతలి పరికరంలో ఉన్న సువాసన ద్రవాల సాయంతో ఆ వాసనను మళ్లీ సృష్టిస్తారు. ప్రస్తుతం ఒక రకమైన కాఫీ వాసనను గుర్తించగలిగినా, దాని అసలు రకాన్ని పూర్తిగా పునఃసృష్టించడం సాధ్యం కాదు.
Details
ఓహియో యూనివర్శిటి అద్భుతం
ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు చున్యు యాంగ్ ఈ పరిశోధనకు ప్రధాన కర్తగా ఉన్నారు.
భవిష్యత్తులో ఆన్‌లైన్‌లో పెర్ఫ్యూమ్ కొనేముందే దాని వాసనను పరీక్షించడం వంటి అవసరాలకు ఈ సాంకేతికత ఉపయోగపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ అధ్యయనం Science Advances జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రస్తుతం ఇది తొలి దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచం మన కళ్లకు కనిపించే దృశ్యాలు, చెవులకు వినిపించే శబ్దాలకే పరిమితం కాకుండా.. మన ముక్కుకు అందే అనుభూతులనూ చేరువ చేసే అవకాశం ఉంది.