Blue Sea Creatures: వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన నీలి సముద్ర జీవులు.. ముట్టుకుంటే ప్రమాదమే!
ఈ వార్తాకథనం ఏంటి
వేల్స్ సముద్ర తీరాల్లో అరుదైన నీలిరంగు సముద్ర జీవులు భారీ సంఖ్యలో కనిపిస్తూ స్థానికులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. యాంగిల్సే,గ్వినెడ్,టెన్బీ బీచ్‌లకు పెద్ద ఎత్తున కొట్టుకొచ్చిన ఈ జీవులు చూడటానికి ఎంతో అందంగా ఉండటంతో వాటి వద్దకు వెళ్లి దగ్గరగా చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే,వాటిని ముట్టుకోవద్దని సముద్ర జీవ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా 'వెలెల్లా వెలెల్లా'గా పిలిచే ఈ జీవులకు 'బై-ది-విండ్ సెయిలర్స్' అనే పేరు కూడా ఉంది. సముద్ర ఉపరితలంపై తేలుతూ గాలి దిశను అనుసరించి ప్రయాణించడం వీటి ప్రత్యేకత. సుమారు ఏడు సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ జీవులు, విషపూరిత లక్షణాలు కలిగిన 'పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్' జాతికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.
వివరాలు
అందంగా ఉన్నా ముట్టుకోవద్దని నిపుణుల హెచ్చరిక
టెన్బీ సౌత్ బీచ్‌లో ఈ జీవులను చూసిన పర్యాటకురాలు మాక్సీన్ అల్లిన్సన్ వాటిని స్ఫటికాల్లా మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించాయని తెలిపారు. దీంతో పలువురు పర్యాటకులు వాటి ఫొటోలు తీసేందుకు, దగ్గరగా వెళ్లి పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఏంజెల్సీ సీ జూకు చెందిన మెరైన్ నిపుణురాలు ఫ్రాంకీ హోబ్రో ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఈ జీవులు ఎంత అందంగా కనిపించినా వాటిని తాకడం ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. వీటి శరీరంలో విషపూరిత కణాలు ఉంటాయని, అవి చనిపోయి తీరానికి కొట్టుకొచ్చిన తర్వాత కూడా చురుకుగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
వివరాలు
సున్నితమైన చర్మం కలిగిన వారు వీటిని తాకితే..
వీటిని తాకితే ముఖ్యంగా సున్నితమైన చర్మం కలిగిన వారికి దురద, మంట, చర్మ చికాకు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్నారులు, పెంపుడు జంతువులను కూడా వీటికి దూరంగా ఉంచాలని సూచించారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఈ అరుదైన జీవులను దూరం నుంచే వీక్షించి ఆనందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో సముద్ర ప్రవాహాల మార్పులు, గాలుల దిశలో వచ్చే తేడాల కారణంగా 'బై-ది-విండ్ సెయిలర్స్' పెద్ద సంఖ్యలో తీర ప్రాంతాలకు కొట్టుకొస్తుంటాయని సముద్ర జీవ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ జీవులు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాటి విషపూరిత లక్షణాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.