Planets Better Than Earth: భూమి కంటే మెరుగైన గ్రహాలు ఉన్నాయా? సూపర్ హాబిటబుల్ గ్రహాలపై పరిశోధనలు
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వంలో భూమిపై మాత్రమే జీవం ఉన్నట్లు ఇప్పటివరకు మనకు తెలిసినప్పటికీ, జీవం పుట్టడానికి, అభివృద్ధి చెందడానికి భూమి కంటే మెరుగైన పరిస్థితులు కలిగిన గ్రహాలు కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహాలను 'సూపర్ హాబిటబుల్' (మహా జీవవాసయోగ్య) గ్రహాలుగా పిలుస్తున్నారు. భూమి కంటే కొంత వెచ్చని వాతావరణం, విస్తారమైన లోతు తక్కువగా ఉండే సముద్రాలు, జీవం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన స్థిరమైన పరిస్థితులు ఈ గ్రహాలపై ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
సూపర్ హాబిటబుల్ గ్రహాలు ఎలా ఉంటాయి?
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. ఈ తరహా గ్రహాలు భూమి కంటే 20 నుంచి 30 శాతం పెద్ద వ్యాసాన్ని కలిగి ఉండవచ్చు.
వీటి ద్రవ్యరాశి కూడా భూమితో పోలిస్తే రెట్టింపు ఉండే అవకాశం ఉంది.
దీనివల్ల గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండి, దట్టమైన వాతావరణాన్ని గ్రహం తన చుట్టూ నిలుపుకోగలదు.
ఫలితంగా వాతావరణ పరిస్థితులు సుదీర్ఘకాలం స్థిరంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.
భూమిపై ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే పరిస్థితుల మాదిరిగా.. ఈ గ్రహాలపై లోతు తక్కువగా ఉండే సముద్రాలు, సరస్సులు, ద్వీపాలు ఎక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇలాంటి భౌగోళిక పరిస్థితులు జీవ వైవిధ్యం పెరగడానికి మరింత అనుకూలంగా ఉండవచ్చని వివరిస్తున్నారు.
వివరాలు
K-డ్వార్ఫ్ నక్షత్రాలు ఎందుకు కీలకం?
సూపర్ హాబిటబుల్ గ్రహాల అన్వేషణలో K-డ్వార్ఫ్ నక్షత్రాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి మన సూర్యుడి కంటే చిన్నవిగా, తక్కువ ఉష్ణోగ్రతతో నారింజ రంగులో కనిపిస్తాయి.
ఈ నక్షత్రాలు తమలోని ఇంధనాన్ని నెమ్మదిగా వినియోగించుకుంటాయి.
అందువల్ల కొన్ని వేల కోట్ల సంవత్సరాల పాటు స్థిరంగా కాంతిని విడుదల చేయగలవు.
వీటి చుట్టూ పరిభ్రమించే గ్రహాలపై జీవం పుట్టేందుకు, క్రమంగా సంక్లిష్టమైన జీవరూపాలుగా పరిణామం చెందేందుకు ఎక్కువ సమయం లభించే అవకాశం ఉంటుంది.
వివరాలు
K-డ్వార్ఫ్ నక్షత్రాలు ఎందుకు కీలకం?
మరో 50 కోట్ల సంవత్సరాల కాలంలో సూర్యుడి ఉష్ణోగ్రత పెరగడం వల్ల భూమిపై జీవుల మనుగడ కష్టతరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా.
అయితే, K-డ్వార్ఫ్ నక్షత్రాలు సుదీర్ఘకాలం స్థిరంగా ఉండగలవు. అంతేకాకుండా, ప్రయోగశాలల్లో ఈ నక్షత్రాల కాంతిని అనుకరించి మొక్కలను పెంచినప్పుడు అవి కిరణజన్య సంయోగక్రియను నిర్వహించినట్లు పరిశోధనల్లో గుర్తించారు.
ఈ ఫలితం కూడా K-డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ జీవానికి అనుకూలమైన గ్రహాలు ఉండవచ్చనే సిద్ధాంతానికి మద్దతుగా నిలుస్తోంది.
వివరాలు
భవిష్యత్తులో ఎలా గుర్తిస్తారు?
సూపర్ హాబిటబుల్ గ్రహాల భావనను శాస్త్రవేత్తలు రెనే హెల్లర్, జాన్ ఆర్మ్స్ట్రాంగ్ 2014లో శాస్త్రీయ ప్రపంచానికి పరిచయం చేశారు.
భూమిని పోలిన గ్రహాల కోసం వెతకడంతో పాటు, జీవం మనుగడకు భూమి కంటే మెరుగైన పరిస్థితులు కల్పించే గ్రహాలపై కూడా పరిశోధనలు జరపాలని వారు సూచించారు.
అయితే, ఇప్పటివరకు ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్న సూపర్ హాబిటబుల్ గ్రహం ఉనికిని శాస్త్రవేత్తలు ధ్రువీకరించలేదు.
ఒక గ్రహంపై జీవానికి అనుకూలమైన వాతావరణం ఉన్నంత మాత్రాన అక్కడ జీవం తప్పనిసరిగా ఉంటుందని చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
వివరాలు
భవిష్యత్తులో ఎలా గుర్తిస్తారు?
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష పరిశోధనలు కీలకం కానున్నాయి.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టనున్న ప్లేటో మిషన్ (2027), జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్, నాసా ప్రతిపాదించిన హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ వంటి ప్రాజెక్టుల ద్వారా ఇలాంటి గ్రహాలను గుర్తించి, వాటి వాతావరణాన్ని అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యంగా, ఆయా గ్రహాల వాతావరణంలో జీవం ఉనికిని సూచించే సంకేతాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించనున్నారు.
ఈ పరిశోధనల ద్వారా విశ్వంలో భూమి ఒక్కటే జీవానికి అనుకూలమైన గ్రహమా? లేక మనకు తెలియని మరిన్ని జీవవాసయోగ్య ప్రపంచాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉంది.