LOADING...
Grokipedia:వికీపీడియాకు పోటీగా 'గ్రోకీపీడియా'.. కృత్రిమ మేధస్సు ఆధారిత విజ్ఞాన సర్వస్వం
కృత్రిమ మేధస్సు ఆధారిత విజ్ఞాన సర్వస్వం

Grokipedia:వికీపీడియాకు పోటీగా 'గ్రోకీపీడియా'.. కృత్రిమ మేధస్సు ఆధారిత విజ్ఞాన సర్వస్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్‌ స్థాపించిన xAI కంపెనీ రూపొందించిన ఈ ప్లాట్‌ఫారం సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ ట్రాఫిక్ కారణంగా వెబ్‌సైట్ క్రాష్ అయింది. ప్రస్తుతం తిరిగి ఆన్‌లైన్‌లోకి వచ్చిన గ్రోకీపీడియా, 8 లక్షల 85 వేలకుపైగా వ్యాసాలు కలిగి ఉందని పేర్కొంటోంది. దీన్ని వికీపీడియా కంటే మరింత మెరుగైన వేదికగా మస్క్‌ దీన్ని ప్రచారం చేస్తున్నారు. లాంచ్‌ కొద్దిగా ఆలస్యమైనందుకు కారణం, వెబ్‌సైట్‌లో ఉన్న పాక్షికమైన లేదా ప్రచారాత్మక సమాచారాన్ని తొలగించాల్సి రావడమే అని మస్క్‌ తెలిపారు.

సారూప్యతలు 

గ్రోకీపీడియా నిజంగా వికీపీడియా కంటే భిన్నమా?

మస్క్‌ ఎంత బోల్డ్‌ క్లెయిమ్స్‌ చేసినా, మొదటిసారి ఉపయోగించిన వారు చెబుతున్నదేమిటంటే.. గ్రోకీపీడియాలో ఉన్న విషయాలు చాలా వరకు వికీపీడియాలో ఉన్నవే అని గమనించారట. వెబ్‌సైట్‌లో కూడా స్పష్టంగా "ఈ కంటెంట్‌ వికీపీడియా నుండి మార్పులు చేసి తీసుకోబడింది. ఇది క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్ అలైక్ 4.0 లైసెన్స్ కింద అందుబాటులో ఉంది" అని ఒక నోటు ఉంచారు. దీంతో గ్రోకీపీడియా నిజంగా కొత్తదా లేక వికీపీడియాకు కొత్త రూపమా అనే సందేహాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి.

ప్లాట్ఫారం తేడాలు 

మస్క్‌ ఆరోపణలు, గ్రోక్‌ ఇంటిగ్రేషన్

వికీపీడియా రాజకీయ పాక్షికతతో వ్యవహరిస్తుందనే ఆరోపణలను మస్క్‌ చాలాకాలంగా చేస్తున్నారు. నిజాలను కంటే అభిప్రాయాల ఆధారంగా కంటెంట్‌ మారుస్తుందని ఆయన విమర్శించారు. కొన్ని విషయాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, కొన్ని ప్రోత్సహిస్తారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా, గ్రోకీపీడియాలో ఇన్‌లైన్‌ సిటేషన్స్‌ లేదా మూల లింకులు లేవు. అయితే, ఇది xAI సంభాషణాత్మక అసిస్టెంట్‌ "గ్రోక్‌"తో అనుసంధానమై ఉండటం వల్ల, వినియోగదారులు సహజమైన భాషలో ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందగలరని చెబుతున్నారు.

వివాదాలు

రైట్ బయాస్ ఆలోచనలపై ఆరోపణలు

వాషింగ్టన్ పోస్ట్, వైర్డ్ లాంటి పత్రికలు గ్రోకీపీడియా కంటెంట్‌లో ఫార్‌-రైట్‌ (కుడి పక్ష) అభిప్రాయాలు ప్రతిఫలిస్తున్నాయని నివేదించాయి. ముఖ్యంగా లింగ నిర్వచనం, ట్రాన్స్‌జెండర్‌ అంశాల విషయంలో గ్రోకీపీడియా భిన్నమైన దృక్పథం చూపుతోందని అవి పేర్కొన్నాయి. ఉదాహరణకు, "లింగం అనేది మనుషులను బయోలాజికల్‌గా మగ లేదా ఆడగా విభజించే వర్గీకరణ" అని ప్రారంభమయ్యే నిర్వచనం వికీపీడియాలో ఉన్న విస్తృత సామాజిక-సాంస్కృతిక వివరణతో పూర్తిగా భిన్నంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రొఫైల్ వ్యత్యాసాలు 

మస్క్‌ను కొత్త కోణంలో చూపిస్తున్న గ్రోకీపీడియా 

గ్రోకీపీడియాలో మస్క్‌ గురించి ఉన్న ఎంట్రీ, వికీపీడియాతో పోలిస్తే అతన్ని మరింత సానుకూలంగా చూపుతుంది. అందులో మస్క్‌ కృత్రిమ మేధస్సు ప్రాజెక్టులు "నియంత్రణలకు కాకుండా నిజాన్వేషణకు ప్రాధాన్యం ఇచ్చే సురక్షిత AI అభివృద్ధి"గా వర్ణించబడ్డాయి. అలాగే, కొన్ని ప్రోడక్ట్‌ లాంచ్‌లను "xAI వేగవంతమైన ఆవిష్కరణలకు నిదర్శనం"గా పేర్కొంటూ, "సెన్సార్‌షిప్‌ తగ్గించి నిజాలపై దృష్టి పెట్టే ప్రయత్నం"గా మస్క్‌ వ్యాఖ్యానించినట్లు చేర్చారు. అయితే, ఇందులో ఒక తప్పు సమాచారం కూడా ఉందని విమర్శలు ఉన్నాయి. అంటే, ఒహాయో గవర్నర్‌ అభ్యర్థి వివేక్‌ రామస్వామి గురించి, ఆయన DOGE గ్రూప్‌ను ట్రంప్‌ పరిపాలనలో విలీనం చేయకముందే వదిలేశారనే వాస్తవం తప్పుగా ప్రస్తావించబడిందని నివేదికలు చెబుతున్నాయి.