LOADING...
End of an era: 25ఏళ్ల అడోబ్ యానిమేట్'కు గుడ్‌బై.. ఏఐపై దృష్టి
25ఏళ్ల అడోబ్ యానిమేట్'కు గుడ్‌బై.. ఏఐపై దృష్టి

End of an era: 25ఏళ్ల అడోబ్ యానిమేట్'కు గుడ్‌బై.. ఏఐపై దృష్టి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ యానిమేషన్ రంగంలో దాదాపు 25 ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన తన 2డీ యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అడోబ్ యానిమేట్ ను నిలిపివేయాలని అడోబ్ నిర్ణయించింది. దీంతో ఒక యుగానికి ముగింపు పలికినట్టయింది. ఈ విషయాన్ని సోమవారం కంపెనీ తన సపోర్ట్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ రూపంలో వెల్లడించడంతో పాటు, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఈమెయిల్స్ ద్వారా కూడా తెలియజేసింది. ఈ నిర్ణయం వెనుక అడోబ్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై కంపెనీ తన క్రియేటివ్ క్లౌడ్ ఉత్పత్తుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలని భావిస్తోంది. అధికారికంగా 2026 మార్చి 1 నుంచి అడోబ్ యానిమేట్ సేవలు నిలిచిపోతాయి.

వివరాలు 

ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు 2029 మార్చి వరకు టెక్నికల్ సపోర్ట్

ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు మాత్రం 2029 మార్చి వరకు టెక్నికల్ సపోర్ట్ కొనసాగనుంది. మిగతా యూజర్లకు 2027 మార్చి వరకు మాత్రమే సహాయం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రకటనతో చాలా మంది పాత యూజర్లు నిరాశకు గురయ్యారు. వెబ్ యానిమేషన్లు, గేమ్ డిజైన్, ఇంటరాక్టివ్ కంటెంట్ తయారీలో యానిమేట్‌ను నమ్ముకున్న అనేక మంది కళాకారులు, డిజైనర్లు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అడోబ్ యానిమేట్ మొదట్లో ఇంటర్నెట్ ప్రారంభ దశలో పేరు తెచ్చుకున్న ఫ్లాష్ సాఫ్ట్‌వేర్‌గా మొదలై, కాలక్రమేణా మారుతూ వచ్చింది.

వివరాలు 

యానిమేట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఇతర క్రియేటివ్ క్లౌడ్ యాప్‌లు 

FAQలో అడోబ్ విడుదల చేసిన ప్రకటనలో, "25 ఏళ్లకు పైగా యానిమేషన్ రంగాన్ని తీర్చిదిద్దడంలో యానిమేట్ కీలకంగా పనిచేసింది. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ, యూజర్ల అవసరాలకు సరిపోయే కొత్త ప్లాట్‌ఫాంలు వస్తున్నాయి. ఈ మార్పును గుర్తించి యానిమేట్‌కు మద్దతు నిలిపివేయాలని నిర్ణయించాం" అని పేర్కొంది. దీన్ని బట్టి యానిమేట్‌ను అడోబ్ తన గతంగా చూస్తోందని స్పష్టమవుతోంది. యానిమేట్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అడోబ్ ఇప్పటివరకు ప్రకటించలేదు. బదులుగా, కొన్ని పనులకు ఇతర క్రియేటివ్ క్లౌడ్ యాప్‌లను ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. క్లిష్టమైన యానిమేషన్‌లకు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్,సాధారణ మోషన్ ఎఫెక్ట్స్‌కు అడోబ్ ఎక్స్‌ప్రెస్ వంటివి వాడుకోవచ్చని చెబుతోంది. అయితే,యానిమేట్ ఇచ్చే సౌలభ్యం,ఫ్లెక్సిబిలిటీ ఇవేవీ పూర్తిగా ఇవ్వవని ప్రొఫెషనల్ యానిమేటర్లు అంటున్నారు.

Advertisement

వివరాలు 

ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు అడోబ్ అడుగులు

ఇప్పటికే కొన్ని నెలలుగా ఈ నిర్ణయానికి సంకేతాలు కనిపించాయి. అడోబ్ మ్యాక్స్ 2025 కాన్ఫరెన్స్‌లో యానిమేట్ కనిపించకపోవడం, 2025 వెర్షన్ విడుదల కాకపోవడం అనుమానాలకు తావిచ్చాయి. అయినా అధికారిక ప్రకటన రావడంతో ఇప్పుడు చాలా మంది ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్‌ల కోసం వెతుకుతున్నారు. ఏదేమైనా, వెబ్ విజువల్ కల్చర్‌ను తీర్చిదిద్దిన వేలాది కళాకారులు, స్టూడియోల ద్వారా అడోబ్ యానిమేట్ వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో అడోబ్ మాత్రం ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది.

Advertisement