Dinosaur Bone: 40 ఏళ్ళ తరువాత అతి పురాతనమైన డైనోసర్ ఎముక గుర్తించిన శాస్త్రవేత్తలు..ఎక్కడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
అంటార్కిటికాలో ఇప్పటివరకు గుర్తించిన తొలి డైనోసార్ ఎముక దాదాపు 40ఏళ్ల పాటు ఓ డ్రాయర్‌లో మరుగున పడిపోయి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణ శిలాజంలా కనిపించిన ఈ ఎముకను 1985లో వెలికితీసినా,అది ఏ జీవికి చెందినదో అప్పట్లో స్పష్టంగా తెలియకపోవడంతో బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే(BAS)కు చెందిన కేంబ్రిడ్జ్ భూగర్భ శాస్త్ర విభాగంలో భద్రపరిచారు. ఇటీవల శిలాజ నిపుణులు ఈ నమూనాను మళ్లీ పరిశీలించగా,ఇది టైటానోసార్ అనే భారీ డైనోసార్ జాతికి చెందిన తోక వెన్నెముక అని నిర్ధారించారు. టైటానోసార్‌లు భూమిపై సంచరించిన అతిపెద్ద డైనోసార్‌లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఈగుర్తింపు ద్వారా అంటార్కిటికాలో కోట్ల ఏళ్ల క్రితం జీవించిన జీవజాతుల గురించి మరింత సమాచారం లభించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
అంటార్కిటికాలోని జేమ్స్ రాస్ ద్వీపంలో ఈ శిలాజం సేకరించారు
బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేలో కలెక్షన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మార్క్ ఎవాన్స్, గతంలో అంటార్కిటికా యాత్రల నుంచి తీసుకొచ్చిన వేలాది శిలాజాలను పరిశీలిస్తుండగా ఈ ఎముక ఆయన దృష్టికి వచ్చింది. "డ్రాయర్‌లలో ఏమున్నాయో పరిశీలిస్తుంటే కొన్ని అరుదైన నమూనాలు కనిపించాయి. ఈ శిలాజాన్ని చూసిన వెంటనే ఇది ప్రత్యేకమైనదిగా అనిపించింది" అని ఆయన తెలిపారు. ఈ శిలాజం అంటార్కిటికాలోని జేమ్స్ రాస్ ద్వీపంలో 1985 డిసెంబర్ 9న సేకరించారు. భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ మైక్ థాంసన్ తన ఫీల్డ్ నోట్‌బుక్‌లో దీన్ని "పెద్ద సరీసృపానికి చెందిన వెన్నెముక"గా నమోదు చేశారు. సుమారు 10 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ శిలాజానికి చిన్న బొమ్మను కూడా ఆయన గీశారు.
వివరాలు
అంటార్కిటికాలో కనుగొన్న తొలి డైనోసార్ శిలాజం
ఆ సమయంలో పరిశోధకులు ఇది సముద్ర సరీసృపానికి చెందిన ఎముక అయి ఉంటుందని భావించినట్లు మార్క్ ఎవాన్స్ తెలిపారు. అయితే తాను పరిశీలించిన వెంటనే ఇది డైనోసార్ వెన్నెముకను పోలి ఉందని గుర్తించానని చెప్పారు. అలాగే 1985లోనే ఇది సేకరించనందున, అంటార్కిటికాలో కనుగొన్న తొలి డైనోసార్ శిలాజంగా ఇది నిలిచే అవకాశముందని భావించారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శిలాజ నిపుణుడు ప్రొఫెసర్ పాల్ బారెట్‌ను సంప్రదించారు. శిలాజాన్ని పరిశీలించిన వెంటనే ఇది టైటానోసార్ వెన్నెముకేనని స్పష్టమైందని ఆయన తెలిపారు. ఒక చివర గుండ్రంగా, మరో చివర లోపలి గుంతలా ఉండే ప్రత్యేక నిర్మాణం టైటానోసార్‌ల వెన్నెముకలకు మాత్రమే ఉంటుందని వివరించారు.
వివరాలు
100కు పైగా టైటానోసార్ జాతులు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100కు పైగా టైటానోసార్ జాతులు గుర్తించారు. ఇవన్నీ నాలుగు కాళ్లపై నడిచే శాకాహార డైనోసార్‌లు. పొడవైన మెడతో చెట్లపై ఉన్న ఆకులను తినేవి. కొన్ని టైటానోసార్‌లు 35 మీటర్ల పొడవు, సుమారు 60 టన్నుల బరువు వరకు పెరిగేవి. అయితే అంటార్కిటికాలో లభించిన ఈ వెన్నెముక ఆధారంగా అక్కడి టైటానోసార్ సుమారు 7 మీటర్ల పొడవు మాత్రమే ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అది చిన్న వయస్సులో ఉన్న డైనోసార్ కావచ్చని లేదా పూర్తిగా ఎదిగినా చిన్న పరిమాణంలో ఉండే ప్రత్యేక జాతి కావచ్చని వారు భావిస్తున్నారు. ఈ డైనోసార్ సుమారు 8.2 కోట్ల సంవత్సరాల క్రితం చివరి క్రిటేషియస్ కాలంలో జీవించింది.
వివరాలు
1985 తర్వాత వెలుగులోకి వచ్చిన అంటార్కిటికాలో కొన్ని డైనోసార్ శిలాజాలు
ప్రస్తుతం మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా అప్పట్లో దట్టమైన అడవులతో నిండి ఉండేదని, శాకాహార డైనోసార్‌లకు సమృద్ధిగా ఆహారం లభించేదని శాస్త్రవేత్తలు తెలిపారు. 1985 తర్వాత కూడా అంటార్కిటికాలో కొన్ని డైనోసార్ శిలాజాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, వాటి సంఖ్య చాలా తక్కువ. మంచు పొరల కింద దాగి ఉన్న పురాతన శిలాజాలను వెలికితీయడం అక్కడి కఠిన వాతావరణం కారణంగా ఇప్పటికీ పెద్ద సవాలుగా ఉంది. అయినప్పటికీ ఈ శిలాజం కోట్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా జీవంతో కళకళలాడిన ప్రాంతమని నిరూపిస్తోందని, ఆ కాలం జీవావరణాన్ని అర్థం చేసుకోవడంలో ఇది కీలక ఆధారంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.