Gaia Sausage Crash: 10 బిలియన్ ఏళ్ల క్రితం ఢీకొట్టిన గెలాక్సీతో పాలపుంత దిశ మారిందా?
ఈ వార్తాకథనం ఏంటి
మనం నివసిస్తున్న పాలపుంత (మిల్కీ వే)గెలాక్సీ ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండేదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సౌర కుటుంబం ఏర్పడకముందే,సుమారు 10 బిలియన్(వంద కోట్ల)ఏళ్ల క్రితం జరిగిన భారీ గెలాక్సీల ఢీకొట్టే ఘటన వల్ల పాలపుంత దాదాపు 90 డిగ్రీలకు పైగా దిశ మార్చుకుందని తాజా పరిశోధనలో తేలింది. పరిశోధకుల వివరాల ప్రకారం,"గయా సాసేజ్"(Gaia Sausage)గా పిలిచే ఒక చిన్న గెలాక్సీ నేరుగా పాలపుంతను ఢీకొట్టింది. ఈ భారీ ఢీకొట్టే సమయంలో ఆ చిన్న గెలాక్సీ పూర్తిగా ఛిద్రమైపోగా,అందులోని నక్షత్రాలను పాలపుంత తనలో కలుపుకుంది. అయితే ఈ సంఘటనతో ఏర్పడిన తీవ్ర ప్రభావం వల్ల పాలపుంత గెలాక్సీ మొత్తం నిర్మాణమే మారిపోయి, ప్రస్తుతం కనిపిస్తున్న దిశలోకి నెమ్మదిగా తిరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వివరాలు
పాలపుంత చుట్టూ ఉండే "స్టెల్లార్ హాలో"లోని నక్షత్రాల కదలికలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు
బ్రిటన్‌లోని డర్హమ్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటర్లతో నిర్వహించిన అనుకరణ (సిమ్యులేషన్) అధ్యయనాల్లో ఈ విషయాన్ని గుర్తించారు.
గయా సాసేజ్ పరిమాణంలో ఉన్న గెలాక్సీ నేరుగా ఢీకొంటే పాలపుంతలాంటి గెలాక్సీల్లో "డిస్క్ ఫ్లిప్" అనే ప్రక్రియ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా,కొన్ని వందల మిలియన్ సంవత్సరాల పాటు క్రమంగా జరిగినట్లు ప్రధాన పరిశోధకుడు కిరిల్ బాత్రకోవ్ తెలిపారు.
ఈ పరిశోధనలో భాగంగా పాలపుంత చుట్టూ ఉండే "స్టెల్లార్ హాలో"లోని నక్షత్రాల కదలికలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
సాధారణంగా పాలపుంత ప్రధాన డిస్క్‌లోని నక్షత్రాలు సెకనుకు సుమారు 220 కిలోమీటర్ల వేగంతో గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతాయి.
వివరాలు
సెకనుకు 25కిలోమీటర్ల వేగంతో కదులుతున్న హాలోలోని నక్షత్రాలు
కానీ హాలోలోని నక్షత్రాలు మాత్రం సెకనుకు కేవలం 25కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతున్నాయి.
ఈ తేడాకు కారణమేంటి అన్న ప్రశ్నకు సమాధానం కోసం నిర్వహించిన సిమ్యులేషన్‌లలో గయా సాసేజ్ ఢీకొట్టిన తర్వాత డిస్క్ ఫ్లిప్ జరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడైంది.
10 బిలియన్ ఏళ్ల నాటి ఈ గెలాక్సీల ఢీకొట్టే ఘటనకు సంబంధించిన తొలి ఆధారాలు 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నిర్వహించిన గయా (Gaia) మిషన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఆ సమయంలో కొన్ని నక్షత్రాలు అసాధారణంగా సాసేజ్ ఆకారంలో ఉన్న కక్ష్యల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు.
వాటి కదలికలను విశ్లేషించగా,పాలపుంత గుండెకాయలోకి నేరుగా దూసుకొచ్చిన ఒక చిన్న గెలాక్సీ విచ్ఛిన్నం కావడంతో అవి ఏర్పడ్డాయని తేలింది.
వివరాలు
గెలాక్సీకి"గయా సాసేజ్"
ఈ ఆధారాల ఆధారంగానే ఆ గెలాక్సీకి"గయా సాసేజ్"అనే పేరు పెట్టారు.
ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, పాలపుంత చరిత్రలో జరిగిన చివరి అతిపెద్ద గెలాక్సీ విలీనం ఇదే.
ఈ సంఘటన వల్ల గెలాక్సీ మధ్యభాగంలో బల్జ్ (Bulge) ఏర్పడటంతో పాటు, చుట్టూ ఉన్న నక్షత్రాల హాలో కూడా ప్రధానంగా రూపుదిద్దుకుంది.
గయా సాసేజ్‌ను చిన్న గెలాక్సీగా వర్గీకరించినప్పటికీ, అందులోని నక్షత్రాలు, వాయువులు, డార్క్ మ్యాటర్ మొత్తం కలిపి సూర్యుడి ద్రవ్యరాశికి 10 బిలియన్ రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
భవిష్యత్తులో మరికొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత సమీపంలోని "లార్జ్ మగెలానిక్ క్లౌడ్" గెలాక్సీ పాలపుంతలో కలిసే అవకాశం ఉందని, అది మరో పెద్ద మార్పుకు కారణమవుతుందని వారు అంచనా వేస్తున్నారు.
వివరాలు
"సాజిటేరియస్ డ్వార్ఫ్ గెలాక్సీ"
ఇప్పటికే "సాజిటేరియస్ డ్వార్ఫ్ గెలాక్సీ" కూడా పాలపుంతతో విలీనం అవుతున్నప్పటికీ, అది గయా సాసేజ్‌తో పోలిస్తే చాలా చిన్నది కావడంతో పాలపుంతపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఈ అధ్యయన వివరాలను బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జాతీయ ఖగోళ సదస్సులో శాస్త్రవేత్తలు వెల్లడించారు.