Gemini app: జెమిని యాప్‌కు 95 కోట్లకు చేరిన నెలవారీ యాక్టివ్ యూజర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది. కంపెనీ అభివృద్ధి చేసిన జెమిని (Gemini) ఏఐ ప్లాట్‌ఫామ్‌కు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, జెమిని యాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల (MAUs) సంఖ్య ప్రస్తుతం 95 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరగడం గమనార్హం. వినియోగదారులకు మరింత మెరుగైన ఏఐ ఆధారిత సేవలను అందించడంపై దృష్టి పెట్టడంతో ఈ వృద్ధి సాధ్యమైందని ఆయన తెలిపారు.
వివరాలు
మంచి ఆదరణ పొందుతున్న 'జెమిని స్పార్క్'అసిస్టెంట్
జెమిని యాప్‌లో ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా 'డైలీ బ్రీఫ్' ద్వారా రోజువారీ అవసరాలకు అనుగుణంగా సమాచారాన్ని అందించడంతో పాటు,వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే'జెమిని స్పార్క్'అసిస్టెంట్ మంచి ఆదరణ పొందుతోంది.
ఈ ఫీచర్ల కారణంగా యాప్ వినియోగం వేగంగా పెరుగుతోందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
మరోవైపు గూగుల్ సెర్చ్‌లో ప్రవేశపెట్టిన'ఏఐ మోడ్'కూడా వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది.
గతఏడాది అక్టోబర్‌లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా 100కోట్ల మందికిపైగా ఉపయోగిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఈఏఐ మోడ్ వల్ల గూగుల్ సెర్చ్ వినియోగం పెరగడమే కాకుండా,ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా వివిధ వెబ్‌సైట్లకు వందల కోట్ల క్లిక్‌లు చేరుతున్నాయని వివరించారు.
వివరాలు
తర్వాతి తరం ఏఐ మోడల్ జెమిని 4పై పరిశోధనలు ప్రారంభం
ఏఐ రంగంలో తన సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు గూగుల్ కొత్త మోడళ్లను కూడా వరుసగా విడుదల చేస్తోంది.
ఇందులో జెమిని 3.6 ఫ్లాష్, జెమిని 3.5 ఫ్లాష్-లైట్, జెమిని 3.5 ఫ్లాష్ సైబర్ వంటి మోడళ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
అదే సమయంలో తదుపరి తరం ఏఐ మోడల్ జెమిని 4 అభివృద్ధిపై కూడా పరిశోధనలు ప్రారంభించినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతి నెలా 90 లక్షల మందికిపైగా డెవలపర్లు గూగుల్ ఏఐ మోడళ్లను ఉపయోగించి వివిధ రకాల అప్లికేషన్లను రూపొందిస్తున్నారని తెలిపారు.
వివరాలు
90 శాతం సంస్థలు జెమిని ఎంటర్‌ప్రైజ్ సేవలను ఉపయోగిస్తున్నాయి: సుందర్ పిచాయ్
వ్యక్తిగత వినియోగదారులతో పాటు కార్పొరేట్ సంస్థల నుంచి కూడా గూగుల్ ఏఐ సేవలకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది.
ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్ 100 కంపెనీలలో దాదాపు 90 శాతం సంస్థలు జెమిని ఎంటర్‌ప్రైజ్ సేవలను ఉపయోగిస్తున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఈ పెరుగుతున్న డిమాండ్ ప్రభావంతో గూగుల్ క్లౌడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 82 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఏఐపై కంపెనీ చేస్తున్న భారీ పెట్టుబడులు గూగుల్ సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్ సేవలు, డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లను మరింత శక్తివంతంగా మార్చడంతో పాటు సంస్థ వ్యాపార విధానాన్ని పూర్తిగా రూపాంతరం చెందిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.