Thailand: థాయిలాండ్‌లో కొత్త డైనోసార్ జాతి .. ఆగ్నేయాసియాలోనే అతిపెద్దదిగా శాస్త్రవేత్తల వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్‌లో లభ్యమైన శిలాజాల ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త డైనోసార్ జాతిని గుర్తించారు. 'నాగాటైటాన్'గా పేరుపెట్టిన ఈ డైనోసార్ ఆగ్నేయాసియాలో ఇప్పటివరకు గుర్తించిన వాటిలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు. దీని బరువు సుమారు 27 టన్నులు ఉండగా, పొడవు 27 మీటర్లు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇది తొమ్మిది పెద్ద ఆసియా ఏనుగుల బరువుతో సమానమని తెలిపారు. పొడవైన మెడ కలిగిన శాకాహారి సౌరోపాడ్ కుటుంబానికి చెందిన ఈ డైనోసార్, డిప్లోడోకస్ కంటే కూడా ఎక్కువ పొడవుగా ఉండేదని చెప్పారు.
వివరాలు
థాయిలాండ్ ఈశాన్య ప్రాంతంలోని ఒక చెరువు సమీపంలో శిలాజాలు
దశాబ్దం క్రితం థాయిలాండ్ ఈశాన్య ప్రాంతంలోని ఒక చెరువు సమీపంలో ఈ శిలాజాలు బయటపడ్డాయి. యూకే, థాయిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం వీటిని పరిశీలించి కొత్త జాతిగా గుర్తించింది. 'నాగాటైటాన్ చయ్యాఫుమెన్సిస్' అని పూర్తి పేరు పెట్టారు. ఇందులో 'నాగా' అంటే ఆగ్నేయాసియా జానపద కథల్లో వచ్చే సర్పం, 'టైటాన్' అంటే గ్రీకు పురాణాల్లోని దేవతలను సూచిస్తుందని తెలిపారు. 'చయ్యాఫుమెన్సిస్' అనేది శిలాజాలు లభించిన చయ్యాఫుమ్ ప్రావిన్స్ పేరుతో పెట్టినట్లు వెల్లడించారు.
వివరాలు
థాయ్‌లాండ్ చివరి టైటాన్
ఈ డైనోసార్ సుమారు 10 కోట్ల నుంచి 12 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే టైరోనోసారస్ రెక్స్ కంటే దాదాపు 4 కోట్ల సంవత్సరాల ముందే భూమిపై సంచరించిందని తెలిపారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన థాయ్ పరిశోధకుడు థిటివూట్ సెథపానిచ్సకుల్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌లో డైనోసార్ అవశేషాలు లభించిన అత్యంత కొత్త రాతి పొరల్లో ఇవి దొరికాయని చెప్పారు. అందుకే దీనిని "థాయ్‌లాండ్ చివరి టైటాన్"గా పిలుస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
థాయ్‌లాండ్ అధికారికంగా పేరు పెట్టిన డైనోసార్లలో ఇది 14వది
ఇక థాయ్‌లాండ్‌లో ఇప్పటివరకు అధికారికంగా పేరు పెట్టిన డైనోసార్లలో ఇది 14వదిగా నిలిచింది. మహాసారఖామ్ యూనివర్సిటీకి చెందిన ప్యాలియోంటాలజిస్టు డాక్టర్ సితా మనిట్‌కూన్ మాట్లాడుతూ.. ఆసియాలో డైనోసార్ శిలాజాల పరంగా థాయ్‌లాండ్ మూడో అత్యంత సంపన్న దేశంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ డైనోసార్ జీవించిన కాలంలో భూమిపై ఉష్ణోగ్రతలు, కార్బన్ డయాక్సైడ్ స్థాయులు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాంటి వేడి పరిస్థితుల్లో కూడా ఈ భారీ శాకాహారి డైనోసార్లు ఎలా జీవించాయన్నది ఆసక్తికర అంశమని పరిశోధకులు తెలిపారు.