Page Loader
Gmail: జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి.. 
జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి..

Gmail: జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి రోజూ Gmailకి అనేక రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి.ఇవి ఇన్‌బాక్స్‌ను నింపుతూ, ముఖ్యమైన మెయిల్స్ మిస్ కావడానికి కారణమవుతాయి. ఆఫర్లు, అమ్మకాల ప్రకటనలు,యాప్ అప్‌డేట్‌లు వంటి ఎన్నో ప్రోమోషనల్ మెయిల్స్ కారణంగా అవసరమైన మెయిల్స్ కనపడక పోవడం చాలా సార్లు జరుగుతుంది. ముఖ్యంగా తక్షణంగా స్పందించాల్సిన మెయిల్స్‌కు సమాధానం ఇచ్చే సమయానికే వీటి వల్ల ఆలస్యం కావచ్చు. అయితే ఇప్పుడు Gmailలో ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ అయిన 'Manage Subscriptions' ఈ సమస్యలకు పరిష్కారంగా మారింది. ఇది ఎలా పనిచేస్తుంది? ఎలా ఉపయోగపడుతుంది? అందరికి తెలుసుకోవాల్సిన విషయమే!

వివరాలు 

Gmail వినియోగదారులకు కొత్త 'Manage Subscriptions' ఫీచర్ 

Google తన Gmail ప్లాట్‌ఫార్మ్‌లో 'Manage Subscriptions' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఉపయోగించేందుకు సులభమైనది మాత్రమే కాకుండా, మెయిల్‌ను నిర్వహించడంలో నిజమైన మేలు చేకూరుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఒకే చోట మీకు వచ్చిన అన్ని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను చూడవచ్చు. ఇవి మీరు ఇంతకు ముందు స్వయంగా సబ్‌స్క్రైబ్ చేసినవి కాకుండా, ఎప్పుడో అనుకోకుండా యాక్టివేట్ చేసినవి కావచ్చు. ఈ కొత్త ఫీచర్‌ వల్ల ఒక్కో మెయిల్‌ను తెరిచి, అందులోని అన్‌సబ్‌స్క్రైబ్ లింకును వెతకాల్సిన అవసరం లేదు. దాని అవసరం లేకుండానే, ఈ ఫీచర్ మీకు అన్ని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను ఒకేచోట చూపుతుంది. మీరు అవసరమని అనుకున్న మెయిల్స్‌ను కొనసాగించవచ్చు. మిగిలినవి అయితే ఒక్క క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు.

వివరాలు 

ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి? 

ఈ కొత్త సౌలభ్యం పొందడం కోసం మీరు ప్రత్యేకంగా ఏ సెట్టింగ్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు Gmail యాప్ అయినా,వెబ్ వెర్షన్ అయినా తెరిచి చూసినప్పుడే "Manage Subscriptions" అనే ఎంపిక అందుబాటులో ఉంటుంది. మీ Gmail అకౌంట్‌ను ఓపెన్ చేసి,ఇన్‌బాక్స్‌కి వెళ్లండి.అక్కడ ఎడమ వైపున ఉన్న "Promotions", "Social","Spam" ట్యాబ్ల్లోఈ కొత్త ఎంపిక కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ మెయిల్స్ మీకు అవసరమో ఎంచుకోగలరు. అవసరం లేని, కేవలం స్టోరేజీని ఆక్రమిస్తున్న మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో తొలగించవచ్చు. దీంతో మీ Gmail ఖాతాలో నిల్వ స్పేస్‌ను తగ్గించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా Gmail ఉపయోగం మరింత సులభం, శుభ్రంగా ఉండేలా మారుతుంది. అనవసర మెయిల్స్‌కు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది!