Google Images: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ ఇమేజెస్.. భారీ మార్పులతో కొత్త డిజైన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ ఇమేజెస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూగుల్ భారీ మార్పులతో కొత్త డిజైన్‌ను పరిచయం చేసింది. ఈ అప్‌డేట్‌ను దశలవారీగా వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో ప్రధానంగా "ఫర్ యూ" (For You) పేరుతో కొత్త గ్యాలరీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది యూజర్ల ఆసక్తులు, వారు గతంలో చూసిన కంటెంట్ ఆధారంగా సంబంధిత చిత్రాలను సూచిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ రూపకల్పన పింటరెస్ట్‌ను పోలి ఉంటుంది. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఐడియాలు, ప్రేరణ కలిగించే చిత్రాలను మరింత సులభంగా కనుగొనే అవకాశం ఉంటుంది. ఈ మార్పులతో యూజర్లు గూగుల్ ఇమేజెస్‌లో ఎక్కువ సమయం గడిపే అవకాశముండటంతో, గూగుల్ ప్రకటనల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వివరాలు
కొత్త డిజైన్‌లో "కలెక్షన్స్" ఫీచర్..
కొత్త డిజైన్‌లో "కలెక్షన్స్" (Collections) అనే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చిత్రాలను సేవ్ చేసుకుని, తర్వాత అవసరమైనప్పుడు వెంటనే చూసుకోవచ్చు.
దుస్తుల ఎంపిక, ఇంటి అలంకరణ, ప్రయాణాల ప్రణాళిక వంటి అవసరాల కోసం ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది.
అంతేకాకుండా, గూగుల్ తన ఏఐ మోడల్ ఆధారంగా పనిచేసే కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది.
ఇందులో యూజర్లు సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా గూగుల్ సెర్చ్‌లోనే తమకు కావాల్సిన కస్టమ్ విజువల్స్‌ను రూపొందించుకోవచ్చు.
వివరాలు
ఏఐ మోడ్‌లో ఇమేజ్ క్రియేషన్..
కొత్త డిజైన్‌తో పాటు వచ్చిన అన్ని ఫీచర్లను వచ్చే కొన్ని వారాల్లో అమెరికాలో డెస్క్‌టాప్‌లో ఇంగ్లీష్ భాషను ఉపయోగిస్తున్న యూజర్లకు దశలవారీగా విడుదల చేయనున్నారు.
ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించాలంటే వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్‌లో సైన్ ఇన్ అయి ఉండాలి.
ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ప్రస్తుతం AI Modeలో ఇమేజ్ క్రియేషన్‌కు మద్దతు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీష్ భాషలో అందుబాటులోకి రానుంది.
వివరాలు
మరికొన్ని కీలక ఫీచర్లు..
ఈ రీడిజైన్‌తో పాటు గూగుల్ నానో బనానా 2 లైట్ (Nano Banana 2 Lite) అనే ఏఐ ఆధారిత ఇమేజ్ క్రియేషన్ టూల్‌ను కూడా పరిచయం చేసింది.
దీని సహాయంతో యూజర్లు సెర్చ్‌లో ఇచ్చే ప్రశ్నల ఆధారంగా ప్రత్యేకమైన చిత్రాలను సృష్టించుకోవచ్చు.
AI Mode అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ ఫీచర్ త్వరలో విడుదల కానుంది. 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ తన విజువల్ సెర్చ్ ప్రయాణంలోని ముఖ్యమైన మైలురాళ్లను కూడా గుర్తు చేసింది.
ఇందులో సిమిలర్ ఇమేజెస్ (2009), సెర్చ్ బై ఇమేజ్ (2011), గూగుల్ లెన్స్ (2018) వంటి కీలక ఫీచర్లను ప్రస్తావించింది.