Google Pixel Watch 5: గూగుల్ పిక్సెల్ వాచ్ 5 వచ్చేసింది.. ధర, ఫీచర్లు, బ్యాటరీ వివరాలివే
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన తాజా స్మార్ట్‌వాచ్ 'పిక్సెల్ వాచ్ 5'ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డ్యూయల్ చిప్ ఆర్కిటెక్చర్, మరింత ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో పాటు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే 'హెల్త్ గార్డియన్' ఫీచర్లను ఇందులో అందించింది. శ్వాసకు సంబంధించిన అత్యవసర పరిస్థితులను గుర్తించే ప్రత్యేక సదుపాయాన్ని కూడా వాచ్‌లో పొందుపరిచింది. 45ఎంఎం మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకు పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది.
వివరాలు
ధర ఎంతంటే..
పిక్సెల్ వాచ్ 5లో 41ఎంఎం వేరియంట్ ప్రారంభ ధర రూ.42,999గా ఉంది. పెద్దదైన 45ఎంఎం మోడల్‌ను రూ.45,999కు విక్రయించనుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 నుంచి సాధారణ విక్రయాలు మొదలుకానున్నాయి.
3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే..
పిక్సెల్ వాచ్ 5లో 3,000 నిట్స్ గరిష్ఠ ప్రకాశాన్ని అందించే యాక్టువా 360 అమోలెడ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను ఉపయోగించారు.
ఇది 60Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సదుపాయం కూడా ఉంది. స్క్రీన్‌ను గీతలు పడకుండా ఉండేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ కల్పించారు.
వివరాలు
కొత్త డ్యూయల్ చిప్ సెటప్..
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జెన్ 2 యాక్సిలరేటెడ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు కార్టెక్స్-ఎం55 కో-ప్రాసెసర్‌ను పిక్సెల్ వాచ్ 5లో అమర్చారు.
ఈ రెండు చిప్‌ల వ్యవస్థ కారణంగా గత తరం మోడల్‌తో పోలిస్తే పనితీరు 20 శాతం వరకు మెరుగుపడుతుందని గూగుల్ పేర్కొంది.
ర్యామ్‌ను కూడా 50 శాతం పెంచింది. స్టోరేజ్ విషయానికి వస్తే 64జీబీ ఈఎంఎంసీ మెమొరీ అందించారు.
వివరాలు
వాచ్‌లోనే జెమినీ..
గూగుల్ జెమినీని పిక్సెల్ వాచ్ 5లో మరింత లోతుగా అనుసంధానించింది.
చేతిని పైకెత్తి వాచ్ నుంచే నేరుగా జెమినీతో మాట్లాడే అవకాశం ఉంది.
అంతేకాదు.. జీమెయిల్, క్యాలెండర్ తదితర గూగుల్ సేవల నుంచి సమాచారాన్ని తీసుకుని వినియోగదారులకు అవసరమైన వివరాలను ముందుగానే సూచించే సదుపాయాన్ని కూడా అందించారు.
హెల్త్ ట్రాకింగ్ కోసం..
ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించి పిక్సెల్ వాచ్ 5లో పలు ఫీచర్లు ఉన్నాయి.
ఈసీజీ,AFib గుర్తింపు,గుండె వేగం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు ఇందులో లభిస్తాయి.
వీటితో పాటు SpO2, హెచ్‌ఆర్‌వీ, శ్వాస రేటు, చర్మ ఉష్ణోగ్రతలో మార్పులు, ఒత్తిడి స్థాయులను కూడా వాచ్ పర్యవేక్షిస్తుంది. నిద్ర నాణ్యతను ట్రాక్ చేసే సదుపాయం కూడా ఉంది.
వివరాలు
'హెల్త్ గార్డియన్' ప్రత్యేకత..
కొత్తగా తీసుకొచ్చిన 'హెల్త్ గార్డియన్' ఫీచర్ వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ధోరణులను నెలవారీగా చూపిస్తుంది.
రక్తపోటు మార్పుల తీరు, నిద్ర సమయంలో శ్వాస నాణ్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రెండ్స్ వంటి వివరాలను ఇందులో పరిశీలించవచ్చు.
మరోవైపు 'బ్రీథింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్' ఫీచర్ ఆక్సిజన్ స్థాయులు తీవ్రంగా, నిరంతరంగా తగ్గుతున్న సందర్భాలను గుర్తించేలా రూపొందించారు.
తద్వారా శ్వాసకు సంబంధించిన అత్యవసర పరిస్థితులను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది.
వివరాలు
40 గంటల వరకు బ్యాటరీ..
ఫిట్‌నెస్ కోసం 50కిపైగా వ్యాయామాలను ట్రాక్ చేసే సామర్థ్యం పిక్సెల్ వాచ్ 5లో ఉంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ కూడా అందించారు.
బ్యాటరీ విషయానికి వస్తే 41ఎంఎం మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల వరకు, 45ఎంఎం వేరియంట్ 40 గంటల వరకు పనిచేస్తుందని గూగుల్ తెలిపింది.
ఇక వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కేవలం 15 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
అదనంగా ఈ స్మార్ట్‌వాచ్‌కు ఐపీ68 రేటింగ్ ఇచ్చారు.