Google Free Storage: గూగుల్ కొత్త రూల్.. ఫోన్ నంబర్ లేకుంటే 5GB స్టోరేజ్ మాత్రమే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కొత్తగా అకౌంట్ సృష్టించే ప్రతి యూజర్‌కు జీ మెయిల్, డ్రైవ్, ఫోటోస్ సేవల కోసం 15GB ఉచిత స్టోరేజ్ అందిస్తుండగా, 2026 మే నుంచి ఈ విధానంలో పెద్ద మార్పు చేసింది. ఇకపై కొత్తగా సృష్టించే గూగుల్ అకౌంట్లకు డిఫాల్ట్‌గా కేవలం 5GBస్టోరేజ్ మాత్రమే ఇస్తోంది. పూర్తి 15GB స్టోరేజ్ పొందాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ మార్పు టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, ఇప్పటికే అనేక మంది యూజర్లు దీనిని గమనించినట్లు తెలుస్తోంది. కొత్త జీ మెయిల్ అకౌంట్ సృష్టించే సమయంలో స్టోరేజ్ పరిమితి తగ్గినట్లు కనిపిస్తోందని తెలుస్తోంది.
వివరాలు
ఎందుకు ఈ మార్పు?
స్పామ్ అకౌంట్లు, ఫేక్ ప్రొఫైల్స్‌ను తగ్గించడం, యూజర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా గూగుల్ ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులు ప్రస్తుతం కేవలం కొత్త అకౌంట్లకే వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న పాత అకౌంట్లకు ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. పాత యూజర్లు ఇప్పటిలాగే 15GB ఫ్రీ స్టోరేజ్‌ను కొనసాగించవచ్చు.
వివరాలు
15GB స్టోరేజ్ తిరిగి ఎలా పొందాలి?
కొత్తగా గూగుల్ అకౌంట్ సృష్టించే సమయంలో సైన్-అప్ ప్రక్రియలో ఫోన్ నంబర్ జోడించే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా వెరిఫై చేస్తే, పూర్తి 15GB స్టోరేజ్ అన్‌లాక్ అవుతుంది. ఇప్పటికే 5GB స్టోరేజ్‌తో అకౌంట్ క్రియేట్ చేసిన వారు కూడా తరువాత ఫోన్ నంబర్ జోడించి 15GB పొందే అవకాశం ఉంది. ఇందుకోసం జీ మెయిల్ లేదా గూగుల్ ఆకౌంట్ సెట్టింగ్‌లోకి వెళ్లి 'యాడ్ ఫోన్ నెంబర్' ఆప్షన్ ద్వారా మొబైల్ నంబర్ వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ పూర్తైన కొన్ని గంటల్లో లేదా తక్షణమే స్టోరేజ్ 15GBకి అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
వివరాలు
ఫోన్ నంబర్ ఇవ్వకపోతే?
ఫోన్ నంబర్ జోడించడానికి ఇష్టపడని యూజర్లు 5GB స్టోరేజ్‌తోనే కొనసాగాల్సి ఉంటుంది. లేకపోతే గూగుల్ ఓన్ సేవ ద్వారా అదనపు స్టోరేజ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకే ఫోన్ నంబర్‌తో ఎన్ని అకౌంట్లు వెరిఫై చేయవచ్చన్న విషయంలో గూగుల్ భవిష్యత్తులో పరిమితులు విధించే అవకాశముందని సమాచారం.