Page Loader
Google: భారత్‌లో 'గూగుల్‌ సేఫ్టీ' చార్టర్‌ ప్రారంభం.. డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు
భారత్‌లో 'గూగుల్‌ సేఫ్టీ' చార్టర్‌ ప్రారంభం.. డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు

Google: భారత్‌లో 'గూగుల్‌ సేఫ్టీ' చార్టర్‌ ప్రారంభం.. డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసాల నివారణకు గూగుల్‌ తాజాగా 'సేఫ్టీ చార్టర్‌' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా తర్వాత భారత్‌లోనే ఇది ప్రారంభించడం విశేషం. దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ మోసాలు, ముఖ్యంగా యూపీఐ సంబంధిత మోసాలు దృష్ట్యా గూగుల్‌ ఈ చర్య తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం గత ఏడాది యూపీఐ మోసాలు 85 శాతం పెరిగినట్లు వెల్లడైంది.

Details

భారత్‌లో GSec సెంటర్‌

ఈ సేఫ్టీ చార్టర్‌ భాగంగా గూగుల్‌ భారత్‌లో జి‌సెక్‌ (GSec - గూగుల్‌ సెక్యూరిటీ ఇంజినీరింగ్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేసింది. డబ్లిన్‌, మ్యూనిక్‌, మలాగా తర్వాత నాలుగవ సెక్యూరిటీ సెంటర్‌ ఇది. ఈ కేంద్రం సాయంతో ప్రభుత్వం, విద్యా సంస్థలు, చిన్న వ్యాపారాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచి సైబర్‌ భద్రతపై పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నట్లు గూగుల్‌ తెలిపింది.

Details

 కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం

డిజిటల్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గూగుల్‌ కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్‌ (I4C)తో చేతులు కలిపింది. 2023లో ప్రారంభమైన డిజికవచ్‌ (DigiKavach) అనే ఆన్‌లైన్ మోసాలను గుర్తించే కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. మోసపూరిత ఆప్‌లు, ప్రిడేటరీ లోన్‌ సేవల దుష్ప్రభావాన్ని తగ్గించడమే దీని లక్ష్యం. మోసాల నిరోధనకు AIతో పోరాటం ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ తన ఏఐ(AI)టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ స్క్యామ్స్‌ను ఎదుర్కొంటోంది. లక్షలాది యాడ్స్, అకౌంట్లను తొలగించింది. భారతదేశంలో కూడా గూగుల్‌ ఏఐను మరింత ప్రభావవంతంగా వినియోగించనుంది. ఉదాహరణకు, గూగుల్‌ మెసేజెస్‌(Google Messages)లోని ఏఐ ఆధారిత స్కామ్ డిటెక్షన్ ఫీచర్‌ ప్రతి నెలా 500 మిలియన్ల స్కామ్ మెసేజెస్‌ను నిరోధిస్తోంది.

Details

గూగుల్‌ పే, ప్లే ప్రొటెక్ట్‌లో జాగ్రత్తలు

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ అప్లికేషన్లలో ఒకటైన గూగుల్‌ పే (Google Pay) ఇప్పటివరకు 41 మిలియన్ల స్కామ్‌ ట్రాన్సాక్షన్లపై హెచ్చరికలు జారీ చేసింది. ఇక గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ (Google Play Protect) సేవ గత ఏడాది 13 మిలియన్ల పరికరాల్లో 220,000 హై రిస్క్‌ యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నిరోధించింది. ఈ విధంగా గూగుల్‌ తన సైబర్‌ సేఫ్టీ చర్యలతో భారతదేశంలో డిజిటల్ మోసాలపై గట్టిగా నిలబడేందుకు సన్నద్ధమవుతోంది.