Android apps: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ షాక్.. ఎక్కువ RAM వాడే యాప్స్‌పై చర్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆండ్రాయిడ్ యాప్స్ విషయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మెమరీ (RAM) వినియోగించే యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న RAM వినియోగ సమస్యకు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్ ఈ మెమరీ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. డెవలపర్లు పరిశ్రమవ్యాప్తంగా ఉన్న హార్డ్‌వేర్ పరిమితులు, ఆండ్రాయిడ్‌లోని మెమరీ పరిమితులను దృష్టిలో ఉంచుకుని యాప్స్‌ను రూపొందించాలని గూగుల్ సూచించింది.
వివరాలు
మరిన్ని డివైజ్‌లకు కొత్త నిబంధనలు..
కొత్త మెమరీ పరిమితులను తొలిసారిగా ఆండ్రాయిడ్ 17తో పాటు పిక్సెల్ ఫోన్లలో గూగుల్ అమలు చేసింది.
త్వరలో ఈ నిబంధనలు ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్లకు కూడా విస్తరించనున్నాయి.
రాబోయే ఏడాది కాలంలో మరిన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ డివైజ్‌లలో ఒక్కో యాప్‌కు అనుమతించే మెమరీ పరిమితులను అమలు చేయనున్నాయని గూగుల్ తెలిపింది.
4GB RAM నుంచి 16GB లేదా అంతకంటే ఎక్కువ RAM ఉన్న ఫోన్ల వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
వివరాలు
ఎక్కువ RAM వాడితే యాప్స్‌పై చర్యలు..
కొత్తగా నిర్ణయించిన మెమరీ పరిమితులను దాటే యాప్స్‌ను గూగుల్ అంత తేలిగ్గా వదిలిపెట్టదు.
అధిక మెమరీని వినియోగించే యాప్స్ పనితీరును తగ్గించడం లేదా అవసరమైతే వాటిని పూర్తిగా నిలిపివేయడం చేయొచ్చని తెలిపింది.
అంతేకాదు.. నిబంధనలను పాటించని యాప్స్, గేమ్స్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వాటి యాప్ విజిబిలిటీ తగ్గించడంతో పాటు.. ప్లే స్టోర్‌లో కొత్త వెర్షన్లను పబ్లిష్ చేసే సామర్థ్యంపై కూడా పరిమితులు విధించే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది.
ఈ కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి.
దీంతో డెవలపర్లకు తమ యాప్స్‌ను కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకునేందుకు కొంత సమయం లభించనుంది.
వివరాలు
కొత్త పనితీరు ప్రమాణాలు ఇవే..
మారుతున్న స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గూగుల్ కొత్త పనితీరు ప్రమాణాలను కూడా తీసుకొస్తోంది.
ముఖ్యంగా డైనమిక్ మెమరీ వినియోగం, బిట్‌మ్యాప్ వినియోగానికి సంబంధించి కొత్త పరిమితులను ప్రవేశపెడుతోంది.
యాప్స్‌లో కోడ్‌ను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు కొన్ని ఆప్టిమైజేషన్ నిబంధనలను కూడా అమలు చేయనుంది.
దీని ద్వారా అనవసరంగా యాప్స్ నెమ్మదించడం లేదా క్రాష్ కావడం వంటి సమస్యలను తగ్గించాలని గూగుల్ భావిస్తోంది.
డెవలపర్లకు కొత్త నిబంధనలను అర్థం చేసుకుని అమలు చేసేందుకు ఈ ఏడాది చివర్లో కొన్ని డయాగ్నస్టిక్ టూల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
ఇందులో Memory Limiter అనే ఫీచర్ కూడా ఉంటుంది. డివైజ్‌లో యాప్స్ ఎంత మెమరీని వినియోగిస్తున్నాయో మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
Play Store యాప్స్‌కు Zero Tap Sign-in తప్పనిసరి..
మెమరీ, పనితీరు నిబంధనలతో పాటు గూగుల్ మరో కీలక నిబంధనను కూడా ప్రకటించింది.
2027 ఏప్రిల్ నాటికి అన్ని ప్లే స్టోర్ యాప్స్ Zero Tap Sign-in విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి.
ఆండ్రాయిడ్ డివైజ్ మార్చినప్పుడు యూజర్లు మళ్లీ మళ్లీ తమ అకౌంట్‌లోకి లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా ఈ విధానం పనిచేస్తుంది.
ఇందుకోసం యాప్స్ Android Restore Credentials APIని ఉపయోగించి యూజర్ సైన్-ఇన్ స్టేట్‌ను కొత్త డివైజ్‌లో కొనసాగించాలి.
దీంతో కొత్త ఫోన్‌కు మారినప్పుడు యూజర్లకు ఎదురయ్యే లాగిన్ ఇబ్బందులు తగ్గడంతో పాటు.. వివిధ ఆండ్రాయిడ్ డివైజ్‌ల మధ్య యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.